ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజల సమాచారం.. ఐటీ గ్రిడ్ కంపెనీకి చంద్రబాబు దొంగతనంగా ఇచ్చేశారంటూ… కేటీఆర్ తీర్పు చెప్పేశారు. ఓ వైపు పోలీసుల విచారణ జరుపుతూండగానే… చంద్రబాబు.. తప్పు చేశారని.. తేల్చేశారు. ఆయనకు దమ్ముంటే.. పోలీసుల విచారణకు అంగీకరించాలని కూడా చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం సమాచారం.. దొంగతనానికి గురైతే… తెలంగాణ ప్రభుత్వం ఎలా విచారణ జరుపుతుందని విలేకరులు ప్రశ్నిస్తే.. తప్పు హైదరాబాద్ లో జరిగిందని.. సమర్థించుకున్నారు. వైసీపీ ఐటీ సెల్లో పని చేసే నేత.. లోకేశ్వర్ రెడ్డికి.., విజిల్ బ్లోయర్ అనే ప్రత్యేకహోదాను.. కేటీఆర్… కట్టబెట్టారు. నిజానికి మొదటగా.. దీనిపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారని ప్రచారం జరిగింది. కానీ చివరి క్షణంలో.. లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని తెరపైకి తెచ్చారు. అసలు కేసు.. తెలంగాణలో ఎలా నమోదు చేస్తారన్న మీడియా ప్రశ్నలకు.. కేటీఆర్ చిత్రమైన సమాధానం ఇచ్చారు.
అమరావతి వ్యక్తి అమెరికాపోతే… అక్కడ పర్సు పోతే.. అమరావతిలోనే ఫిర్యాదు చేస్తారనే చిత్రమైన లాజిక్ చెప్పారు. తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంలో తప్పేమీ లేదని వాదించడానికే ప్రయత్నించారు. తప్పు చేయకపోతే.. విచారణకు భయమెందుకంటూ… కేటీఆర్ చాలా రాజకీయ తెలివిని ప్రదర్శించారు. అసలు ఏపీ ప్రబుత్వం సమాచారం.. ఏది బయటకు వచ్చిందో.. పోలీసులు ఇంత వరకూ నిర్దారించలేదు. అసలు లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఏమిటో.. ఆయనకు సంబంధించిన డాటా ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. కానీ.. ఐటీ గ్రిడ్ నుంచి… సర్వర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్ ట్యాప్లు తీసుకెళ్లారు. అందులో ఏం సమాచారం ఉందో..అందులో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి… నిక్షిప్తమైన సమాచారం ఏం ఉందో ఇంత వరకూ బయటపెట్టలేదు. కానీ కేటీఆర్ మాత్రం.. ఏపీ ప్రభుత్వం సమాచారం… సేవామిత్ర యాప్లో ఉందని తీర్పిచ్చేశారు. విచారణకు సిద్ధపడాలంటూ… రాజకీయ సవాల్ చేశారు.
నిజానికి.. ఐటీ గ్రిడ్ దగ్గర స్వాధీనం చేసుకున్న సర్వర్లలో… ఏమీ లేదని.. నమస్తే తెలంగాణ పత్రిక తెలిపింది. అన్ని డిలీట్ చేశారన్న కారణాన్ని చూపించింది. వాటిని వెనక్కి తీసేందుకు సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటున్నారని కారణాలు చెప్పింది. కానీ కేటీఆర్ మాత్రం.. ఇప్పటికే.. తీర్పు చెప్పేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతకు.. విజిల్ బ్లోయర్ హోదా కట్ట బెట్టి.. ఏపీపై…పోలీసుల్ని అడ్డు పెట్టుకుని చేస్తున్న దాడిని సమర్థించుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం.. రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.