తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు ఐటీ గ్రిడ్ కంపెనీకి చెందిన ఉద్యోగులను… వదిలి పెట్టారు. ఆ కంపెనీకి చెందిన ఉద్యోగి అశోక్.. హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో సోమవారం ఉదయం పదిన్నర కల్లా తమ ముందు ప్రవేశ పెట్టాలని.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ ఆదేశించారు. ఈ మేరకు నలుగురు ఉద్యోగుల్ని… పోలీసులు… న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. ఆ ఉద్యోగులు పోలీసులు తమను అరెస్ట్ చేయలేదని న్యాయమూర్తికి తెలిపారని… ప్రభుత్వ ఏజీ ప్రసాద్ మీడియాకు తెలిపారు. వారి నలుగురిని పోలీసులు వదిలేసినట్లు ప్రకటించారు. కేసులో విచారణ కొనసాగుతుందన్నారు. హేబియస్ కార్పస్ పిటిషన్ను కొట్టి వేశారని ప్రకటించారు.
మరో వైపు ఐటీ గ్రిడ్ కేసులో… లోకేశ్వర్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై.. పోలీసులు సోదాలు చేసి.. స్వాధీనం చేసుకున్న సర్వర్లు, హార్డ్ డిస్కుల్లో… ఆయన ఫిర్యాదుకు సంబంధించిన సమాచారం.. సాక్ష్యాలు ఏమీ లేకపోవడంతో.. సైబరాబాద్ పోలీసులు ఇరుకున పడినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్కు చెందిన అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలోనూ.. ఎలాంటి సమాచారం దొరకలేదని రాశారు. దీంతో.. ఈ కేసు విషయంలో తెలంగాణ పోలీసులు వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. రాంరెడ్డి అనే మరో వైసీపీ నేత నుంచి.. ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేత ఫిర్యాదు మాత్రం.. నేరుగా టీడీపీ యాప్ సేవా మిత్ర పేరు మీద ఉంది. ఏపీ ప్రభుత్వ అధికారిక సమాచారం.. సేవామిత్ర యాప్లో ఉందని.. ఆయన ఫిర్యాదు చేశారని.. తాము దర్యాప్తు చేస్తున్నామని.. ఎస్ఆర్ నగర్ పోలీసులు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన యాప్.. సేవామిత్ర సమాచారం మొత్తం సేకరించడానికే…” ఐటీ గ్రిడ్” కంపెనీని పోలీసులు టార్గెట్ చేశారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో.. లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు వర్కవుట్ కావడం లేదని.. కొత్తగా మరో ఫిర్యాదు చేయించారని.. దానికి నేరుగా.. టీడీపీయాప్ పేరును ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి.. ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం నుంచి కోర్టు పని దినాలు ప్రారంభమవుతాయి. ఈ విషయంలో.. కోర్టులోనే తేల్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.