హైదరాబాద్ లోని ఒక ఐటీ సంస్థ మీద తెలంగాణ పోలీసులు దాడి చేశారు, నలుగురు ఉద్యోగుల్ని అరెస్టు చేశారు. అయితే, ఆ నలుగురినీ అరెస్టే చేయలేదంటూ కోర్టులో పోలీసులు చెప్పారు! వారిది వదిలేశారనీ, విచారణ కొనసాగుతుందని కూడా చెప్పారు. పోలీసులు ఈ తీరుగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనేది ఒక ప్రశ్న..? ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా చోటు చేసుకున్న తెలంగాణ, ఆంధ్ర రాజకీయ పరిణామాలపై ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గమనిస్తున్నారా..? ఇలాంటి సమయంలో ఆయన స్పందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారు..? ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో ఉండాల్సిన పరిస్థితులున్నాయా లేదా అనేది ఆయన పరిశీలిస్తున్నారా..? ఇలాంటి ప్రశ్నలు కూడా కొన్ని తెరమీదికి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం… ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వ్యక్తులు, సంస్థల భద్రతతోపాటు హక్కులను కాపాడే బాధ్యతను రెండు రాష్ట్రాల గవర్నర్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే, హైదరాబాద్ లో శాంతి భద్రతలు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ గవర్నర్ అధీనంలో పనిచెయ్యాల్సి ఉంటుంది. తెలంగాణ పోలీసులు కేసీఆర్ సర్కారు నియంత్రణలో కాకుండా, గవర్నర్ నరసింహన్ అధీనంలో పనిచెయ్యాలని సెక్షన్ 8 చాలా స్పష్టంగా చెబుతోంది. అయితే, ఈరోజే కాదు… గడచిన కొన్నేళ్లుగా ఆ సెక్షన్ అమల్లో ఉందా, గవర్నర్ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా అనేది కొంతమంది విశ్లేషకుల ప్రశ్న..? ఈరోజున ఒక ఐటీ సంస్థకు సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేసి, వారు తమ అధీనంలో లేరు అని తెలంగాణ పోలీసులు బుకాయిస్తుంటే… గవర్నర్ స్పందించారా అనేదే ప్రశ్న?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా హైదరాబాద్ లో పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమౌతున్న తరుణంలో… తన అధీనంలో ఉండాల్సిన పోలీస్ వ్యవస్థను ఆయన ప్రశ్నించరా అనేది ప్రశ్న..? ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 హైదరాబాద్ లో అమలు జరుగుతోందా లేదా అనేది గవర్నర్ ప్రజలకు చెప్పాలనే డిమాండ్ ను పలువురు తెరమీదికి తెస్తున్నారు. హైదరాబాద్ లో ఉమ్మడి రాజధాని కాబట్టి, ఒక రాష్ట్ర పోలీసులు పెత్తనం చేసే అవకాశం లేదు. కానీ, ఆంధ్రా పోలీసులు ఇక్కడికి వచ్చారనీ, లోకేశ్వరెడ్డి ఇంటికి వెళ్లాల్సిన పనివారికేముందంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కేసు నమోదైతే తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకోరా అంటూ సమర్థిస్తున్నారు. అంటే, ఉమ్మడి రాజధానిలో పోలీసు వ్యవస్థపై తమదే అజమాయిషీ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో విభజన చట్టంలోని సెక్షన్ 8 అమల్లో ఉందా లేదా అనేది గవర్నర్ నరసింహన్ స్పష్టం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.