‘ఎక్కడో డాటా ఉంది, ఎవడో ఫిర్యాదు ఇచ్చాడు, దారినపోయే దానయ్య ఇచ్చాడు.. నేను మీ మీద రైడ్ చేస్తున్నానంటే ఇది న్యాయమా’ అంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సభలో ముఖ్యమంత్రి డాటా దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారంటూ తెలంగాణ సర్కారును ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతియ్యాలనుకుంటే, ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ మూలాలు కదిలిపోతాయని హెచ్చరించారు. డాటా అనేది మన సొంతమనీ, అడగడానికి మీరెవరన్నారు. ఎవడో దానయ్య కంప్లయింట్ ఇస్తే, వైయస్సార్ సీపీ దొంగలు ఫిర్యాదు చేస్తే మన మీద చర్యలు తీసుకుంటామంటారన్నారు. మనం హైకోర్టుకు వెళ్లేసరికి కిడ్నాప్ చేసినవారికి వదిలిపెట్టారన్నారు.
ఆరోజు తాను ప్రపంచమంతా తిరిగి ఐటీ కంపెనీలకు హైదరాబాద్ కి రప్పించా అన్నారు సీఎం. హైదరాబాద్ లో కంపెనీలు పెడితే సురక్షితంగా ఉంటుందనీ, ఏ ఇబ్బందులూ ఉండదని మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకు తాను చెప్పి తీసుకొచ్చా అన్నారు. ఈ కేసీఆర్ సర్కారు, ఇదే మాదిరిగా కంపెనీలపై దాడి చేసి, ఎక్కడో డాటా ఉందీ ఎవడో ఫిర్యాదు చేశాడూ అంటూ అరెస్టులు చేస్తే పరిస్థితి ఏంటని చంద్రబాబు నిలదీశారు. ఐటీ సంస్కరణలు తీసుకొచ్చిందే తాననీ, తాతకు దగ్గులు నేర్పిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ‘నా ప్రభుత్వ డాటా ప్రైవసీని వీళ్లు కాపాడతారట. మీ ప్రభుత్వానికి డాటా కూడా లేదు. నా డాటాను నేను కాపాడుకోగలుగుతా’ అన్నారు. ఏపీ డాటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరనీ, ఇక్కడ ఉండే వైకాపా నాయకులు హైదరాబాద్ నుంచి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో టీడీపీ ఉంది కాబట్టే గత ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. ఆంధ్రాలో పార్టీ లేనప్పుడు దొంగాటలు ఎందుకనీ, ధైర్యంగా వస్తే తేల్చుకుందామంటూ కేసీఆర్ కి చంద్రబాబు సవాలు చేశారు. బీహార్ నుంచి పీకే వచ్చి ఇక్కడ 8 లక్షల ఓట్లు తీసేస్తారట, చివరికి తన ఓటును కూడా తీసేస్తారేమో అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఓట్లు తీసేయడానికి ఫామ్ 7లు ఇచ్చారనీ, దీనిపై పోలీసులకూ ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేస్తామన్నారు. జగన్, కేసీఆర్, మోడీ చేస్తున్న కుట్రలను ఉపేక్షించే పరిస్థితి ఉండదనీ, సమర్థంగా తిప్పికొడతామనీ, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం. ఈ డాటా దాడి వ్యవహారం తెలంగాణ సర్కారుకు ఇబ్బందులు తెచ్చిపెట్టేలానే కనిపిస్తోంది. ఎందుకు చేశారని చెప్పడానికి వారి దగ్గర సరైన సమాధానం ఉన్నట్టు లేదు. ఈ డాటా దాడుల వల్ల ఏపీలో వైకాపా కూడా మరిన్ని విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.