టీ ఆర్ పీ గోలలు, డిబేట్లలో బూతులు తిట్టుకోవడం, కొట్టుకోవడం.. ఫ్లాష్ న్యూస్‌ల కోసం ఆరాటం, ఫేక్ న్యూస్‌లతో ప్రాణాలతో చెలగాటం.. ఇదీ మీడియా అంటే. వాటితో సహవాసం చేస్తూ… నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము అతి కొద్దిమందికే ఉంటుంది. అలాంటి ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్ కథతో తయారవుతున్న చిత్రం ‘అర్జున్ సురవరం’. ఓ అబద్దాన్ని నిజం చేయడం చాలా తేలికైన విషయం.. ఓ నిజాన్ని నిజమని నిరూపించడమేకష్టం.. అనే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. ఆ నిజమేంటి? దాన్ని నిజమని నిరూపించడానికి అర్జున్ లెనిన్ సురవరం అనే బీబీసీ న్యూస్ రిపోర్టర్ ఎన్ని కష్టాలు పడ్డాడన్నదే ఈ సినిమా కథ. ‘ముద్ర’ అనే పేరుతో ఈసినిమా మొదలైంది. అయితే టైటిల్ కోసం కొన్ని వివాదాలు చెలరేగడంతో.. ఆ టైటిల్‌ని ‘అర్జున్ సురవరం’గా మార్చారు. కంటెంట్ ఉన్న సినిమా అనే సంకేతాల్ని టీజర్ ఇచ్చింది. థ్రిల్లింగ్ విషయాలు కొన్ని ఈ సినిమాలో ఉన్నాయని టీజర్ చెప్పకనే చెబుతోంది. ‘వెదకాల్సిన వాడు తెలియట్లేదు.. వెతికేవాడు దొరకడం లేదు’ లాంటి కొన్ని ఆసక్తిరరమైన డైలాగ్స్ ఈ టీజర్లో వినిపించాయి. టి. సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. మార్చి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.