అనూహ్యం..
ఎవ్వరూ ఊహించని పరిణామం..
అసలు గాసిప్పుల్లో కూడా వినిపించని కాంబినేషన్
అల్లు అర్జున్ – సుకుమార్.
వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ కలసి ముచ్చటగా మూడో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాంబినేషన్‌ని బన్నీ ఫ్యాన్స్ కూడా ఊహించలేకపోయారు. కానీ.. సడన్‌గా బన్నీ 20వ సినిమాకి దర్శకుడిగా సుకుమార్ పేరు ప్రకటించేసరికి బన్నీ ఫ్యాన్స్ తో పాటు చిత్రసీమ కూడా షాక్‌కి గురైంది. ఆఖరికి మహేష్ బాబుతో సహా.
మహేష్ బాబుతో సుకుమార్ సినిమా ఖాయమై, కథ నచ్చక ఆగిపోయి.. మళ్లీ పట్టాలెక్కబోతోందన్న దశలో `బన్నీ – సుక్కు` కాంబినేషన్ తెరపైకి రావడం ఓ షాక్ లాంటి వార్త. కాకపోతే.. ఈ కాంబినేషన్ వెనుక చాలా విషయాలే జరిగాయి. మైండ్ గేమ్‌లు, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగులు, ఈగో ఫీలింగులూ.. కారణమయ్యాయి. నిజానికి సుకుమార్ తన సినిమాని పక్కన పెట్టి, మరో హీరోని వెదుక్కుంటున్నాడన్న సంగతి ఆఖరికి మహేష్ బాబుకి కూడా తెలీదట. సడన్‌గా ఈ కాంబినేషన్ బయటకు వచ్చేసరికి మహేష్ కాస్త అసననానికి లోనయ్యాడని, అయితే అందులోంచి తేరుకుని హుందాగా ఓ ట్వీట్ వేసి – ఆల్ ది బెస్ట్ చెప్పడం మహేష్ వ్యక్తిత్వానికి నిదర్శనంగా మారింది.
తెరవెనుక ఏం జరిగి ఉంటుందా అని ఆరా తీస్తే.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి
మహేష్ కోసం సుకుమార్ మూడు నాలుగు కథలు వినిపించాడు. అవి మహేష్‌కి పెద్దగా నచ్చలేదు. `మరోటి చెప్పు.. మరోటి చెప్పు` అంటూ తిప్పించుకోవడం మొదలెట్టాడు. మహేష్ కోసం రాసిన కథలోనే మార్పులూ చేర్పులూ చేసుసుంటూ కూర్చున్నాడు సుకుమార్. ఈలోగా…. అనిల్ రావిపూడి కథకు మహేష్ ఓకే చెప్పేయడం, మహర్షి పూర్తవ్వగానే ఆ సినిమానే పట్టాలెక్కించడానికి మహేష్ డిసైడ్ అవ్వడంతో సుకుమార్ కాస్త హర్ట్ అయ్యాడు. అయినా సరే.. తన ప్రయత్నాలేం ఆపలేదు. మహేష్‌కి నచ్చే కథ రాసేంత వరకూ.. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి కథ కూడా ఓకే అయిపోయింది. ఒకటి కాదు.. రెండు కథలు మహేష్‌కి నచ్చాయి. `ఇవి రెండూ చేద్దాం.. ముందు ఇందులో ఒకటి పట్టాలెక్కిద్దాం.. ఆ తరవాత మరో సినిమా సంగతి చూద్దాం` అని మహేష్ కూడా సుకుమార్‌కి మాటిచ్చాడట.
అయితే మహేష్ కోసం తాను కథ సిద్ధం చేసుకుంటున్న సమయంలో అనిల్ రావిపూడి స్క్రిప్టుకి ఓకే చెప్పడం అనేది సుకుమార్‌ని హర్ట్ చేస్తూనే ఉంది. మరోవైపు అల్లు అర్జున్ కథల వేటలో ఉన్నప్పుడు `మహేష్ సినిమా నుంచి సుకుమార్ తప్పుకునే అవకాశాలు ఉన్నాయి` అనే వార్త కొత్త ఆశలు రేకెత్తించింది. సుకుమార్ ని పిలిపించడం.. అల్లు అరవింద్‌తో సహా కూర్చుని రెండు మూడు మీటింగులు పెట్టడం జరిగిపోయాయి.
త్రివిక్రమ్ కథ ఎంతకీ ఓకే అవ్వకపోవడంతో.. ఈ మధ్యలో మరో సినిమా చేస్తే బెటర్ అన్నది బన్నీ ఆలోచన. అందుకే కథలు కూడా వింటున్నాడు. మారుతి, పరశురామ్‌లు కొన్ని కథలు వినిపించారు. అయితే అవేం నచ్చక బన్నీ పక్కన పెట్టేశాడు. ఈ దశలో సుకుమార్ కథ బన్నీకి ఆకర్షించింది. అందుకే `ఎలాగైనా సరే… నాతో ఓ సినిమా చేయాల్సిందే` అని బన్నీ సుకుమార్‌ని బాగా మొహమాట పెట్టేశాడని టాక్. దానికి తోడు ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది. బన్నీతో పాటు అల్లు అరవింద్ కూడా పట్టుపట్టడంతో సుకుమార్ కాదనలేకపోయాడు. అయితే ఈ విషయాన్ని మహేష్‌కి డైరెక్టుగా చెప్పలేకపోయాడు సుకుమార్.
సుకుమార్ చెప్పిక కథ నచ్చక.. మహేష్ సినిమా ఆగిపోయిందంటే అది సర్వసాధారణ విషయం అయ్యేది. కానీ.. సుకుమార్ చెప్పిన కథకి మహేష్ ఓకే అన్న తరవాత కూడా… సుకుమార్ బయటకు వెళ్లిపోవడం, మరో హీరోతో సినిమాని ప్రకటించడం కాస్త ఇబ్బంది కలిగించే విషయాలే. ఈ మొత్తం వ్యవహారంలో అటు మహేష్, ఇటు సుకుమార్ ఇద్దరూ పొరపాట్లు చేశారు. సుకుమార్ తో సినిమా చర్చల్లో ఉన్నప్పుడే అనిల్ రావిపూడికి కమిట్ అయిపోవడం మహేష్ చేసిన తప్పు. తనకు చెప్పకుండా మరో హీరోతో సినిమా చేస్తున్నట్టు ప్రకటన రావడం సుకుమార్ చేసిన తప్పు.
అయితే ఈ తప్పుల వల్ల లాభపడింది మాత్రం బన్నీనే.
మహేష్ – సుకుమార్… భవిష్యత్తులో కలసి పనిచేస్తారా? ఆ అవకాశం ఉందా? అనేది ఇప్పుడే చెప్పలేం. హిట్టుమీదున్న దర్శకుడ్ని వదులుకోవడానికి హీరోకీ, స్టార్ హీరోతో దూరంగా ఉండడానికి దర్శకుడికీ మనసొప్పదు. కాబట్టి.. ఈ కోపాలు, ఈగో ఫీలింగ్సూ అన్నీ తాత్కాలికమే. మహేష్ కూడా జరిగిందంతా మర్చిపోయి సుకుమార్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పాడంటే.. తను స్పోర్టీవ్‌గా తీసుకున్నాడనే అర్థం. మరి సుకుమార్ మనసులో ఏముందో…??