తెలంగాణ ఎన్నికలకు ముందు ఓట్ల గల్లంతుపై చాలా పెద్ద రచ్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి.. ఢిల్లీ టూ హైదరాబాద్ ఎన్నికల అధికారుల వద్దకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చక్కర్లు కొట్టారు. చివరికి కోర్టుకు కూడా వెళ్లారు. ఆయన ప్రయత్నాలు అలా ఉండగానే ఎన్నికలు జరిగిపోయాయి. ఫలితాలొచ్చేశాయి. ప్రతి ఐదు ఓట్లలో ఒకటి గల్లంతయిందనేది అధికారిక సమాచారం. దీనిపై.. ఎన్నికల అధికారి రజత్ కుమార్ “సారీ” చెప్పారు. ఆ సారీతో ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టం పూడిందో లేదో కానీ.. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ఏపీలో ఎనిమిది లక్షల ఓట్ల తొలగింపు కోసం ఫామ్-7 దరఖాస్తులు వచ్చాయని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. మామూలుగా అయితే ఈ సమాచారం ఈసీకి మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి ఫెసిలిటీ ఒకటి ఉందని… ప్రత్యర్థుల ఓట్లను అంతే దారుణంగా తొలగించవచ్చని.. ఇప్పటి వరకూ ఎవరూ పెద్దగా అనుకోలేదు. కానీ.. తెలివి తేటలు ఎక్కడ్నుంచి వచ్చాయో కానీ.. వెల్లువగా వాడేశారు. ఒక్క సారిగా 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ విషయం ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరి చూసుకుంటున్న టీడీపీ నేతలకు తెలిసిపోయింది. అన్నీ చూస్తే.. ప్రధానంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు… అది కూడా.. టీడీపీ సభ్యత్వం ఉన్న వారివే ఎక్కువ ఉండటంతో.. కుట్ర ఉందని నమ్ముతున్నారు. దీనిపై .. ఆందోళనలు ప్రారంభించారు. ఇలా తొలగింపుపై యాభై ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. ఫామ్-7 దరఖాస్తుల్లో అత్యధికం ఆన్ లైన్ ద్వారా కావడంతో పోలీసులు ఐపీ అడ్రస్ల ఆధారంగా … చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఓట్లు తీసేయాలనే దరఖాస్తులు సరే… ఇప్పటి వరకు ఎంత మందివి తొలగించారనే సమాచారం మాత్రం ఇంకా రాలేదు. మీ ఓటు ఉందో లేదో.. చెక్ చేసుకోవాలని రాజకీయ పార్టీలు.. తమ తమ క్యాడర్ను పదే పదే కోరుతున్నాయి. ఈ రాజకీయ పార్టీలు ఓటర్ల లిస్ట్ చేత పట్టుకుని… గడప గడపకూ తిరుగుతున్నాయి. తమ సానుభూతి పరుల ఇళ్లకు వెళ్లి ఓట్లను చెక్ చేసుకోమంటున్నాయి. కానీ ఇంత వరకు అటు టీడీపీ కానీ.. ఇటు వైసీపీ కానీ… ఓట్లు గల్లంతయ్యాయరని చెప్పడం లేదు. ఈ రెండు పార్టీల వెర్షన్ ఒక్కటే.. నోటిఫికేషన్ వచ్చిన తర్వతా తీసేస్తారని… అందుకే దరఖాస్తులు పెట్టారని అంటున్నారు. ఈసీ మాత్రం.. ఈ ఫామ్ 7ల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఒకటికి.. నాలుగు సార్లు పరిశీలన చేస్తోంది. అందులో ఎక్కువగా.. ఫేక్ అని తేలుతూండటమే దీనికి కారణం.