ఆంధ్రప్రదేశ్లో ఫామ్-7 పేరుతో ఓట్ల తొలగింపు దరఖాస్తులు లక్షల్లో వచ్చాయి. ఇలాంటివి కనీసం 8 లక్షలు ఉన్నాయని ప్రాధమికంగా గుర్తించారు. ఇది ఓటును తొలగించాలంటూ చేసుకునే దరఖాస్తు. అయితే, స్వంతంగా చేసుకోవాలి. లేకపోతే ఇతరులు దరఖాస్తు చేసినట్లు ఉండాలి. అక్రమంగా దరఖాస్తు చేసే వాళ్లు రెండూ పెట్టరు. అందుకే ఏపీలో ఇప్పటికే ఇలాంటి దరఖాస్తులు చేసిన ఘటనల్లో అక్రమం అని తేల్చినవి దాదాపుగా రెండు వందలకుపైగా కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. ఈ కేసుల విచారణలో భాగంగా దరఖాస్తులు చేసిన వారు తమకు తెలియనే తెలియదంటున్నారు. తమ పేరుతో ఎవరో చేశారని అంటున్నారు. అందుకే ఇప్పుడు ఐపీ అడ్రస్ల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మొత్తం వ్యవహారాలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సంస్థ చూస్తోంది. ఆ సంస్థ పేరు ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ.. ఐ ప్యాక్. ఈ సంస్థ లోటస్పాండ్ సమీపంలోనే ఓ భారీ భవనంలో ఉంది. అక్కడ్నుంచే వ్యవహారాలు నడుపుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి పనులు చేయాలన్నా “ఐ ప్యాక్” టీమే నిర్దేశిస్తుంది. ఇప్పటికే ఏపీలో అడుగడుగునా సర్వే చేశారు. ఆ సర్వే వివరాలు మొత్తం అక్కడే క్రోడీకరించి మిగతా వ్యవహారాలు చక్క బెడుతున్నారు. బీహార్ మార్క్ రాజకీయాలు చేయడంలో పీకే సిద్ధహస్తుడని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. కులాల మధ్య చిచ్చు పెట్టడం, టీడీపీ ఓటర్లను తొలగించడం లాంటివన్నీ పీకేనే చేయిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు సాంకేతికంగా వివరాలు బయటకు రావడంతో పీకే టీం ఇరుక్కుపోయిందన్న ప్రచారం ఏపీలో జరుగుతోంది. ప్రస్తుతాని ఈ ఐపీ అడ్రస్ల వ్యవహారాన్ని గుట్టుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరిపై అనుమనాలున్నాయనే సమాచారం బయటకు రాకుండా మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. ఐపీ అడ్రస్ల ద్వారా హైదరాబాద్ నుంచే మొత్తం కథ నడిచిందనే దానికి ఆధారాలు సేకరించారు. ఒక్క ఐపీ అడ్రస్లే కాకుండా సాంకేతికంగా ఇతర వివరాలు మొత్తం సేకరించి ఒక్క సారే అరెస్టులు చూపిస్తారని అంటున్నారు. ఈ విషయం తెలుసు కాబట్టే గత మూడు, నాలుగు రోజులుగా పీకే టీంకి టీడీపీ వర్గాల నుంచి హెచ్చరికలు పెరిగాయని అంటున్నారు.