ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా పూర్తిగా లెక్కించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇది శుక్రవారం విచారణకు వస్తోంది. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. దీంతోపాటు, తాజా ఢిల్లీ పర్యటనలో ఎన్డీయేతర పార్టీల నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారని తెలుస్తోంది.
భాజపాకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాట్లకు సంబంధించిన కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల తేదీలు కూడా ఖరారు కావడంతో కూటమి కార్యాచరణ ఏంటనే స్పష్టత ఈ భేటీ వస్తుందనే ఆశాభావం వ్యక్తమౌతోంది. కోల్ కతా తరహాలో భారీ బహిరంగ సభలను నిర్ణయించాలని గతంలో అనుకున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలో వివిధ పార్టీల నేతలు భేటీ అవుతారని అనుకున్నారు. ప్రముఖ పార్టీల నేతలు అందుబాటులో లేకపోవడంతో… ఆ భేటీ జరగలేదు. ఇప్పుడు రాహుల్ తో పాటు మమతా, కేజ్రీవాల్, చంద్రబాబు కలుస్తారు. వీరంతా కలిసి ఇతర జాతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
భాజపాయేతర పార్టీలన్నీ ఒక కూటమిని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిందనే చెప్పాలి. అయితే, ఇంకోపక్క మాయావతి, అఖిలేష్ లు… ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం కూడా నేతల భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ముందుగానే పొత్తుల్ని ప్రకటిస్తే… ఫలితాల తరువాత పరిస్థితుల్లో అనూహ్య మార్పులకు కొంత ఆస్కారం లేకుండా ఉంటుంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే… ప్రీ పోల్ అలయెన్స్ ఉన్న కూటమికే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా ఆహ్వానం వస్తుందన్నది తెలిసిందే. ఆ లెక్కన ఎన్డీయే కూటమి స్పష్టంగానే ఉంది. ఇప్పుడు, ఎన్డీయే వ్యతిరేక కూటమి కూడా ఇలాంటి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా కూటమి కార్యాచరణపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావించొచ్చు.