తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మిగిలి ఉన్న కీలక నేతల్లో ఒకరైన నామా నాగేశ్వరరావు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. అనుచరులతో సమావేశం తర్వాత శుక్రవారమే ఆయన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే.. ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఉన్న ఆయన… నిన్న జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. కనీసం సమాచారం కూడా పంపలేదు. ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన.. టీడీపీ తరపున పోటీ చేయడానికి ఇష్టపడటం లేదని.. చెబుతున్నారు. అందుకే.. కాంగ్రెస్ .. లేకపోతే.. టీఆర్ఎస్ తరపున అయినా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున నామా నాగేశ్వరరావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రచారంలోకి వచ్చినప్పుడే.. ఆయనకు చెందిన మధుకాన్ సంస్థపై.. ఓ కేసు నమోదయింది. ఉత్తరాదిలో ఓ రోడ్ కాంట్రాక్ట్‌ను తీసుకుని.. పనులు చేయకుండా.. బ్యాంక్ రుణాలు దారి మళ్లించారనేది ఆ కేసు. ఇటీవల మధుకాన్ సంస్థలు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుని ఆయన టీడీపీకి దూరమవ్వాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ నేతలతో కూడా నామ టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. టికెట్, గెలుపు అవకాశాలపై తర్జనభర్జన పడుతున్న ఆయన… భవిష్యత్ రాజకీయ అడుగులు ఎటు వేస్తారనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం తరపున ఆయన ఖమ్మం అసెంబ్లీ బరిలో నిలిచి.. టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
టీఆర్ఎస్లోకి వెళ్తారా లేదా అన్నదానిపై… రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే.. టీడీపీలో ఉన్నప్పుడు.. ప్రత్యర్థి వర్గంగా వ్యవహరించిన తుమ్మల ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారు. అయితే.. ఆయన పాలేరు నుంచి ఓడిపోవడంతో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో తుమ్మల మాట చెల్లడం లేదని చెబుతున్నారు. దాంతో.. నామా టీఆర్ఎస్లో చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఏదైనా.. ఒకటి, రెండు రోజుల్లో… నామా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.