ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టావంటూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై… జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రమైన విమర్శలు చేయడం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశం అవుతోంది. సగటు ఆంధ్రుడి భావనను పవన్ కల్యాణ్.. తన మాటల ద్వారా వ్యక్తం చేశారని అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా.. తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగమద్దతుతోనే… ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందుకే పవన్ విరుచుకుపడ్డారు. దీనికి సమాధానం చెప్పే దమ్ము జగన్‌కు ఉందా..?
దొడ్డి దారిన కేసీఆర్‌ను ఏపీకి జగన్ ఎందుకు తెస్తున్నారు…?
పవన్‌కల్యాణ్.. తన ప్రసంగంలో.. చాలా సూటిగా.. ఒక ప్రశ్న వేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిన కేసీఆర్‌ను.. దొడ్డి దోవన… అదే ఏపీకి ఎందుకు తీసుకొస్తున్నారనేది ఆ ప్రశ్న. దీనికి మొదటగా వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు ప్రచారం చేసినందుకు.. కేసీఆర్ పగతో రగిలిపోతున్నారు. రిటర్న్ గిఫ్ట్ అంటూ.. జగన్మోహన్ రెడ్డిని గెలిపించే బాధ్యత నెత్తికెత్తికున్నారు. అందరూ.. నేరుగా.. ఏపీకి వచ్చి ప్రచారం చేస్తారేమో అనుకున్నారు. కానీ.. ఆయన మాత్రం… దొడ్డి దోవ రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ పోలీసుల్ని ప్రయోగించి.. ఏపీపై కూడా.. తమకు పెత్తనం ఉందని చెలరేగిపోతున్నారు. టీడీపీలో ఉన్న పారిశ్రామికవేత్తల్ని బెదిరించి… వైసీపీలో చేర్పిస్తున్నారు. ఇలా అనేక రకాల అంశాలు బయటకు వచ్చాయి. వీళ్లందరూ.. ఏపీకి చెందినా… తర్వాత కేసీఆర్‌కు బాంచన్ నీ కాల్మొక్త అన్నట్లు ఉండాల్సిందే. అందుకే పవన్ కల్యాణ్ నేరుగా జగన్‌పై విమర్శలు గుప్పిచారు. దీనికి వైసీపీకి సమాధానం చెప్పే దమ్ముందా..?
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించ పరిచిన కేసీఆర్‌తో దోస్తీ ఎందుకు..?
ఆంధ్రుల వ్యతిరేకతే… కేసీఆర్‌కు రాజకీయ పెట్టుబడి. ఆయన రాజకీయ జీవితం కోసం.. ఆంధ్రులను.. ఇష్టం వచ్చినట్లు దూషించారు. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడైతే తగ్గిందని అనుకున్నారో.. అప్పుడు ఆంధ్రుల్ని రాక్షసులుగా చూపించేవారు. చివరకు కుక్కలతో కూడా పోల్చారు. ఛీ కొట్టినా… పోవడం లేదన్నారు. ఆంధ్ర సంస్కృతిని అవమానించారు. అవన్నీ ఇప్పుడు… వైరల్ వీడియోలు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా..? అయినా ఎందుకు… జగన్.. ఏపీపై పెత్తనాన్ని కేసీఆర్‌కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు…? ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్.. రాజమండ్రి సభలో సూటిగా ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నేతలకు సమాధానం చెప్పే దమ్ముందా..?
నాడు వైఎస్‌ది రాజకీయం.. నేడు జగన్‌ది లొంగుబాటు..!
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. కేసీఆర్, టీఆర్ఎస్ ఎలా ఉండేవి…?. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందకపోతే… టీఆర్ఎస్ అనే పార్టీ కాలగర్భంలో కలిసిపోయి ఉండేదన్న సంగతి.. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎంతగా ఆకర్షిస్తున్నారో.. అంత కంటే.. ఎక్కువగా.. వైఎస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని లాక్కున్నారు. చివరికి తెలంగాణ భవన్‌ను కూడా తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్వాధీనం చేసుకుంటామోనన్న భయంతో… ఓ రాత్రి … కేసీఆర్.. ఆ భవన్‌లోనే నిద్రపోయారు. వైఎస్ అంతగా.. టీఆర్ఎస్కు వణుకు పుట్టించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు.. అవసరం లేకపోయినా కేసీఆర్ కు లొంగిపోయారు. ఏపీలో టీడీపీలోని ఓడించాలంటే… తనకు టీఆర్ఎస్ సహకారం కావాల్సిందేనన్నట్లుగా… ఆయన దిగజారిపోయారు. పవన్ కల్యాణ్ ఇదే చెప్పారు. మరి దీనికి జగన్ దగ్గర ఆన్సర్ ఉందా..?
ప్రజలపై కన్నా… కేసీఆర్‌పైనే జగన్‌కు నమ్మకం ఎందుకు ఎక్కువ..?
చంద్రబాబుపై కోపం ఉంటే… ప్రజాక్షేత్రంలో ఓడించడానికి ప్రయత్నించాలి కానీ.. దొడ్డి దోవన… ఏపీ ప్రజలపై… పగబట్టి.. ఏదో చేస్తామని భయపెట్టి… రాజకీయాలు చేయడం ఏమిటన్నది పవన్ కల్యాణ్ లాజిక్. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో డైలాగ్‌లా… మనకు మనకు మధ్య చాలా ఉంటాయి. అవి మనం చూసుకోవచ్చు. వేరే వ్యక్తి జోక్యం చేసుకుంటామంటే.. ఎవరైనా సహిస్తారా…? ఎవరూ సహించరు. పవన్ కల్యాణ్ కూడా అంతే. అదే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి.. ఏపీపై పెత్తనం కోసం.. కేసీఆర్ కు సామంతరాజులా మారిపోయారు. పవన్ ఇదే ప్రశ్నించారు. జగన్‌కు.. సమాధానం చెప్పే దమ్ముందా..?