నామినేషన్లకు ఒక్క రోజే ఉండటంతో.. చేరికలను పూర్తి చేసి.. అభ్యర్థుల జాబితాలను ఫైనల్ చేయాలన్న హడావుడిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. పార్టీలో చేర్చుకోవాల్సిన వారందర్నీ ఈవాళ చేర్చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వంగా గీత, నెల్లూరుకు చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, కర్నూలుకు చెందిన బుట్టా రేణుక, ప్రకాశం జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసులరెడ్డిలు… వైసీపీలో చేరారు. అందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరంతా లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులే. తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ టిక్కెట్ ఖరారు చేసుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి… చివరి నిమిషాలో టీడీపీకి షాక్ ఇచ్చి.. చెప్పా పెట్టకుండా… హైదరాబాద్ వచ్చి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు.
ఆయన నెల్లూరు లోక్సభకు పోటీ చేస్తారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి… ఒంగోలు నుంచి లోక్సభకు పోటీ చేస్తారు. వంగా గీత కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేస్తారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బుట్టా రేణుక.. తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని చెబుతున్నారు కానీ.. కర్నూలు సీటు బీసీల సీటు అని పదే పదే నొక్కి చెప్పడంతో.. ఆమె ఉద్దేశం… అక్కడ్నుంచి మరోసారి పోటీ చేయాలనే అని వైసీపీ నేతలంటున్నారు. జగన్ టిక్కెట్ ప్రకటిస్తారో లేదో మాత్రం క్లారిటీ లేదు. టీడీపీ తనను మోసం చేసిందని బుట్టా రేణుక వ్యాఖ్యానించారు. టీడీపీలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. కర్నూలులో బీసీ సిట్టింగ్ సీట్లు ఓసీలకు ఇచ్చారని ఆరోపించారు. జగన్ను సీఎం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.
వైసీపీలోకి తిరిగిరావడం ఆనందగా ఉందన్నారు. కోట్ల టీడీపీలో చేరుతున్నారని తెలిసినా పార్టీలోనే ఉన్నా.. అయినా తనను పిలిచి మాట్లాడలేదని బుట్టారేణుక ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ఆశయాలు నెరవేరాలంటే జగన్ సీఎం కావాలని మాగుంట శ్రీనివాసుల రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం.. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను.. ఇడుపులపాయలో విడుదల చేయనున్నారు. కొత్తగా పార్టీలో చేర్చుకున్న వారికి ఎంతమందికి అవకాశాలు వస్తాయో.. ఆదివారం ఉదయం తేలనుంది.