వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో.. గత ఐదేళ్లలో ఆయన పార్టీకి డుమ్మా కొట్టిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. టీడీపీ నేతలతో బద్ధవైరం ఉన్నప్పటికీ… ఎలాగోలా సర్దుబాటు చేసుకుని ఆ పార్టీలో చేరిపోయారు కానీ.. జగన్మోహన్ రెడ్డి వైపు రాలేదు. అందుకే ఆయనకు మొదటి నుంచి… అభ్యర్థుల కొరత ఉంది. అసెంబ్లీ అభ్యర్థుల కన్నా పార్లమెంట్ అభ్యర్థుల కొరతతో.. వైసీపీ చివరి వరకు సతమతమయింది. వచ్చినంత మందిని మైండ్ గేమ్ ద్వారానో.. సీబీఐ, ఐటీల ద్వారా బెదిరించో… హైదరాబాద్ ఆస్తులు చూపో… టీడీపీ నుంచి లాగినంత మంది లాగగలిగారు. వారినే అభ్యర్థులుగా ప్రకటించుకున్నారు.
తిరుపతి లోక్సభ టిక్కెట్ ఇచ్చిన బల్లి దుర్గా ప్రసాద్… మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న నేత. పనబాక లక్ష్మిని టీడీపీలో చేర్చుకుని.. టిక్కెట్ ఖరారు చేయడంతో… అసంతృప్తిగా ఉన్న ఆయనను వైసీపీ నేతలు టిక్కెట్ ఆఫర్ చేసి చేర్చేసుకున్నారు. ఇక నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి.. నంద్యాల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉంది. కానీ బలమైన అభ్యర్థి లేరని.. చివరికి ఆయన ఆర్థిక స్థోమతను చూసి టిక్కెట్ ఇచ్చారు. ఇక నెల్లురు, ఒంగోలు ఎంపీల అభ్యర్థుల గురించి.. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎంపీ టిక్కెట్లు ఇవ్వడానికి.. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి సక్సెస్ అయ్యారు. గుంటూరు ఎంపీ టిక్కెట్ పొందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా.. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే. పొట్లూరి వరప్రసాద్.. ఏ పార్టీలో లేకపోయినప్పటికీ.. ఆయన ఏ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆ పార్టీలో చేరాలని అనుకున్నారు. చివరికి అదే పని చేశారు. మూడు రోజుల కిందట చేర్చుకుని టిక్కెట్ ఇచ్చేశారు.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా.. టీడీపీ తరపున టిక్కెట్ ఖరారు చేసుకున్నారు. కానీ ఆయన వ్యాపార వ్యవహారాలతో ముడిపెట్టి చివరికి టీడీపీలోకి లాగేశారు. కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి ఏ ఒక్క నేత లేకపోవడంతో.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన వంగాగీతను.. ఒక్క రోజు ముందు పిలిపించి.. కండువా కప్పి టిక్కెట్ ఇచ్చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థుల్లో వైసీపీని అంటి పెట్టుకుని ఉన్న వారిలో మహా అయితే.. ఓ పది మంది మాత్రం ఉంటారు. మిగతా పది మందిని… ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి… టిక్కెట్లు ఇచ్చారు. అంటే. ఆ పార్టీకి అభ్యర్థుల కొరత ఎంత ఎక్కువగా ఉందో ఇట్టే అర్థమైపోతుంది.