వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత .. ఆ పార్టీలో లుకలుకలన్నీ బయటకు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా… వరుసగా.. సమన్వయకర్తల్ని మారుస్తూ.. టిక్కెట్ల ఆశ కల్పించిన వారందరికీ.. జగన్మోహన్ రెడ్డి ఒక్క సారిగా షాక్ ఇచ్చారు. చాలా మంది నేతల్ని పట్టించుకోకుండా… టిక్కెట్లు ఖరారు చేశారు. దాంతో.. అసంతృప్తి సెగలు ఎగసి పడుతున్నాయి. హిందూపురం నుంచి విశాఖ వరకూ.. ఈ అసంతృప్తి సెగలు ఉన్నాయి. అయితే… టిక్కెట్లు దక్కని నేతలకు ఇప్పుడు… ఓ గొప్ప అవకాశం ఎదురుగా ఉంది. అదే జనసేన పార్టీ.
జనసేన పార్టీ.. బలమైన అభ్యర్థుల కోసం వెదుక్కుంటోంది. ఇప్పటికే ప్రకటించిన వారు కాకుండా… మిత్రపక్షాలు సీపీఐ, సీపీఎం, బీఎస్పీకి ఇచ్చేవి కాకుండా… మరో వంద స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఎవరికి పడితే వారికి టిక్కెట్లు ఇస్తే… వారి వల్ల మొత్తానికే మోసం వస్తుంది. అందుకే… జనసేన నేతలు… ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వారిపై కన్నేశారు. తాడేపల్లి గూడెంలో.. టీడీపీ టిక్కెట్ ఆశించిన మున్సిపల్ చైర్మన్‌కు టిక్కెట్ రాదని తెలియగానే.. ఆయనకు టిక్కెట్ ఇచ్చి పార్టీలో చేర్చేసుకున్నారు. అలా.. ఇప్పుడు వైసీపీలో టిక్కెట్లు రాని వారి మీద దృష్టిపెట్టారు. అంతే కాదు.. నియోజకవర్గాల్లో ఓ మాదిరి బలం ఉన్న నేతలపైనా.. కన్నేసారు. నూజివీడులో.. మున్సిపల్ చైర్మన్‌ను పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నారు.
జనసేన జాబితాలో యలమంచిలి రవి, విశాఖ వంశీకృష్ణయాదవ్ సహా.. పలువురు నేతలు చేరే అవకాశం కనిపిస్తోంది. కొంత మంది.. నేరుగా జనసేన కార్యాలయానికే.. టిక్కెట్ కోసం… ఫోన్లు చేస్తూండగా… మరికొంత మందిని జనసేన నేతలు కలుస్తున్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో.. జనసేనలో విస్తృతంగా చేరికలు ఉండే విషయంపై ఎవరికి అనుమానాల్లేవు. టీడీపీ నుంచి కూడా కొంత మంది నేతలు చేరే అవకాశం కనిపిస్తోంది.