ఆంధ్రప్రదేశ్ ఎన్నికల జోరు పెరిగే కొద్దీ… ప్రచార సరళి కూడా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోరాడుతోంది.. వైసీపీ కాదు.. టీఆర్ఎస్ అన్నట్లుగా.. చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. రెండు పార్టీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. అలాగే… తనతో కేసీఆర్ పోటీ పడుతున్నారని చెబుతున్నారు. ఓ రకంగా.. జగన్ కన్నా.. కేసీఆర్ పైనే.. చంద్రబాబు ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. పోటీ.. టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్యనే ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారమే చంద్రబాబుకు ఆయుధం..!
రాజకీయాల్లో ఎత్తుగడలు ఎలా ఉన్నా భాష మాత్రం ఒక్కటే ఉంటుంది. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్… ప్రధానంగా తెలుగుదేశం పార్టీని.. ఆ పార్టీ అధినేతను టార్గెట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ టిక్కెట్లను.. తెలంగాణ భవన్ ఇవ్వడం లేదని అమరావతిలో ఖరారు చేస్తున్నారన్నారు. ఈ రోజు చంద్రబాబునాయుడు కూడా అదే చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థుల జాబితాను… కేసీఆర్ ఖరారు చేశారని.. దాన్ని జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారని చెబుతున్నారు. ఆ రోజు కేసీఆర్ … కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబూ రూ. 500 కోట్లు ఇస్తున్నారు. ఆ ఐదు వందల కోట్లతో రాహుల్ గాంధీ.. తెలంగాణలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారు… కేసీఆర్ చేసే ఆర్థిక సాయం కోసం… జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపిస్తున్నారు. జగన్‌కు కేసీఆర్.. రూ. ఐదు వందల కోట్లు ఇచ్చారని చెబుతున్నారు.
జగన్ గెలిస్తే ఏపీ సామంతరాజ్యమేనా..?
అలాగే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలన్నీ… అమరావతిలో సిద్ధమవుతున్నాయి. టీ కాంగ్రెస్ నేతలకు చంద్రబాబునాయుడే నాయకుడని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. అక్కడ టీఆర్ఎస్ వాహనాలు… రంగుమార్చుకుని వైసీపీ గుర్తులోకి వచ్చేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్… కాంగ్రెస్ గెలిస్తే… ప్రాజెక్టులు ఏమవుతాయని ప్రజలను ప్రశ్నించారు. పాలమూరు -రంగారెడ్డి పథకం ఉండాలా వద్దా..? . కాళేశ్వరం కట్టాలా వద్దా..? అన్నది చంద్రబాబు నిర్ణయిస్తారు. తెలంగాణ భవిష్యత్ ఆంధ్ర ముఖ్యమంత్రి చేతుల్లో పెడదామా అని ప్రశ్నించారు. సరిగ్గా అదే తరహాలో చంద్రబాబు అదే అడుగుతున్నారు. ఆంధ్రా ప్రజల భవిష్యత్ కేసీఆర్ చేతిలో పెడదామా అని ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్‌కు లొంగిపోయారు… తెలంగాణకు సామంతరాజ్యంగా… ఆంధ్రప్రదేశ్ మారుతుందని.. చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఏ స్ట్రాటజీ అయితే కేసీఆర్ అనుసరించి.. తెలంగాణలో రాజకీయ వాతావరణం మార్చుకున్నారో.. ఇప్పుడు చంద్రబాబు అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.
వైసీపీనే టీడీపీకి అస్త్రాలిస్తోందా..?
తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు కేసీఆర్.. చాన్సిచ్చారు. టీడీపీ తరపున యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ కన్నా ఎక్కువగా తెర మీదకు వచ్చారు. దాన్ని కేసీఆర్ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ నేరుగా ఏపీకి వెళ్లకపోయినా… పరిస్థితి అలాగే కనిపిస్తోంది. టీఆర్ఎస్ నేతలు పదేపదే తాము టీడీపీని ఓడిస్తామని చెబుతున్నారు. కేటీఆర్ వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కేటీఆర్‌ను.. జగన్మోహన్ రెడ్డిని కలవడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది..? ఒక్క ఓటు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందా..?. రాజకీయ ప్రయోజనం ఏమీ లేనప్పుడు.. ఇప్పుడే కలవడం ఎందుకు..? ఎన్నికల ఫలితాల తర్వాత… ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించుకోవచ్చు కదా..! కేటీఆర్‌తో.. జగన్ భేటీని.. ఇరవై నుంచి ముఫ్పై శాతం.. వైసీపీ కార్యకర్తలే వ్యతిరేకించారని.. సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అంటే.. సొంత మద్దతుదారుల మద్దతు కూడా కోల్పోతున్నట్లే కదా..! తెలంగాణలో… టీఆర్ఎస్ కాంగ్రెస్, టీడీపీ ఆయుధాలిస్తే…ఏపీలో టీడీపీకి.. వైసీపీనే ఆయుధాలిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు చేతిలో ఓ ఆయుధం ఉంది. మోడీని, బీజేపీని ఏమీ అనడం లేదని చెబుతున్నారు. మోడీకి లొంగిపోయారంటున్నారు. ఇప్పుడు రెండో ఆయుదం.. చంద్రబాబు చేతికి వైసీపీ నేతలు అందించారు. అందుకే ఇప్పుడు ఆంధ్రలో కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. కేసీఆర్ కనుక ప్రచారానికి వెళ్తే ఇది మరింత పెరుగుతుంది. అందుకే కేసీఆర్ ప్రచారానికి వెళ్లే ఆలోచన విరమించుకున్నట్లుగా తెలుస్తోంది.