నారా చంద్రబాబునాయుడు ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత. ఆ పార్టీకి అధినేతగా ఉండటం వల్లే… చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి లభించింది. మరి తనకు సీఎం పదవి వచ్చేలా చేసిన… పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు న్యాయం చేశారా..? పార్టీని ప్రజల్లో తిరుగులేని శక్తిగా మార్చగలిగారా..? అధికార వ్యతిరేకత ప్రభావం పార్టీపై లేకుండా చూసుకున్నారా…?
నాలుగేళ్ల పాటు పార్టీపై నిర్లక్ష్యం చూపిన చంద్రబాబు..!
నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు .. చిందరవందరగా ఉన్న ఏపీ భవిష్యత్‌ను పునర్మించడానికే.. ఎక్కువ సమయం కేటాయించారు. ఆ పునర్మిర్మాణ అవకాశాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీపై మాత్రం.. పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పారు. పాలనా వ్యవహారాల్లో మునిగి తేలి.. పార్టీ పై… పట్టు సడలించారు. ఫలితంగా.. చాలా నియోజకవర్గాల్లో కొంత మందిది ఇష్టారాజ్యం అయిపోయింది. గ్రూపులు ఏర్పడ్డాయి. వాటిని సరి చేయడానికి టిక్కెట్లు పంపిణీ సమయంలో ఇబ్బంది పడాల్సి వచ్చింది. అధికార పార్టీ పేరుతో.. టీడీపీ నేతలు దందాలు చేసినా… వాటి వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే పరిస్థితి వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. అమరావతి, ఆర్థిక స్థితి మెరుగు, పరిశ్రమల ఆకర్షణ అంటూ.. సమయం అంతా… పాలనా వ్యవహారాలకే కేటాయించడంతో… పార్టీలో… నేతలది ఇష్టారాజ్యం అయిపోయింది.
ద్వితీయ శ్రేణి నేతలకు కష్టానికి తగ్గ ఫలితం లభించిందా..?
తెలుగుదేశం పార్టీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. ఆ పదేళ్లలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరిగాయి. చివరికి రాష్ట్ర విభజన జరిగింది. దాంతో పార్టీని కాపాడుకోవాలంటే.. ఏదో ఓ ప్రాంతానికి పరిమితం కావాల్సిన పరిస్థితి. అయినప్పటికీ.. రెండు చోట్ల పార్టీని బతించుకోవడానికి… ప్రయత్నించారు. తెలంగాణలో పార్టీ నేతల్ని బలి పెట్టడానికి సిద్ధపడలేదు. కష్టకాలంలో… అక్కడి నేతలంతా టీడీపీని బలి పెట్టి… ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయినా.. ఉన్న వారి కోసం అయినా… చంద్రబాబు పార్టీని నడిపించాలని ప్రయత్నించారు. ప్రతి శనివారం.. సమయం కేటాయించారు. పార్టీ అధ్యక్షుడిగా.. తెలంగాణలో.. పార్టీని బతికించుకోవడానికి.. శతవిధాలా ప్రయత్నించారు. తెలంగాణలో పార్టీ నిలబడితే.. తనకు కానీ..తన కుటుంబానికి కానీ వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో.. తెలంగాణ నేతలు మాత్రం సీఎం కానీ.. మరే పదవి అయినా పొందుతారు. ఈ విషయంలో చంద్రబాబు కి క్లారిటీ ఉంది. అయినా పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నించారు.
పార్టీని బలోపేతం చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ లేదా..?
పదేళ్ల పాటు పార్టీ జెండాలను మోసిన కార్యకర్తలకు న్యాయం జరిగిందా.. అంటే… జరిగిందని చెప్పలేని పరిస్థితి ఉందని.. నేతలు అంటూ ఉంటారు. ఎన్నికల సమయంలో.. ఇలాంటి అసంతృప్తులు ఎక్కువగా బయట పడుతూ ఉంటాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్యకర్తలు.. నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆశ పడ్డారు. కానీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందన్న కారణంగా… మొదట్లో చురుగ్గా… పోస్టులను భర్తీ చేయలేదు. దాంతో.. టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు.. అధికార పార్టీ అనే హోదాలో ఉన్నారు తప్ప.. పెద్దగా పదవులు పొందలేదు. అయితే.. గత రెండేళ్ల నుంచి పరిస్థితి మారిపోయింది. ఎన్నికల ముందు కూడా.. పెద్ద ఎత్తున పదవులను పంపిణీ చేసి.. కార్యకర్తలను సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. పార్టీ తమకేమీ ఇచ్చిందని కాకుండా.. తాము పార్టీకి ఏమిచ్చామనే ఆలోచన టీడీపీ కార్యకర్తలు చేస్తారని… ఎన్నికల సమయంలో.. అలాంటివేమీ మనసులో పెట్టుకోరని టీడీపీ నేతలు ధీమాతో ఉన్నారు.
అధ్యక్షుడిపై క్యాడర్‌కు అచంచల విశ్వాసం..!
చంద్రబాబు పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టి పార్టీని పెద్దగా పట్టించుకోకపోయినా… తెలుగుదేశం పార్టీలో ఉన్న ఓ వ్యవస్థ.. ఎవరి ప్రమేయం లేకుండానే… కార్యక్రమాలు సాగిపోతూంటాయి. రాజకీయాల్లో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా.. క్యాడర్ సపోర్ట్ చాలా అవసరం. ప్రతీ సందర్భంలోనూ. తమ క్యాడర్ బలాన్ని టీడీపీ నిరూపించుకుంటూనే ఉంది. చంద్రబాబు… ప్రత్యేకహోదా ఉద్యమానికి పిలుపునివ్వగానే… రోడ్లపైకి వచ్చిన టీడీపీ క్యాడరే దీనికి నిదర్శనం. అంతకు ముందు ప్రతిపక్ష నేత .. చాలా సార్లు ఆందోళనకు పిలుపునిచ్చారు కానీ… పెద్దగా సక్సెస్ అయిన పరిస్థితులు లేవు. అదే క్యాడర్ బలం. టీడీపీకి పెట్టని కోట..!