వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ ఈసారి కూడా విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బొత్స ఓడిపోయారు. తరువాత వైకాపాలో చేరారు. 2014లో టీడీపీ నుంచి కిమిడి మృణాళిని ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి అదే కుటుంబం నుంచి కిమిడి నాగార్జునకి టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. ఎప్పట్నుంచో పార్టీ నమ్ముకుంటూ వస్తున్న కొచ్చర్లపాటి త్రిమూర్తులు రాజుకి ఈసారి కూడా టిక్కెట్ దక్కలేదు! దీంతో ఆయన రెబెల్ గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చీపురుపల్లి టీడీపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే… బొత్సకి అనుకూలించేట్టుగానే ఉన్నాయి.
2014 ఎన్నికల్లో కిమిడి మృణాళినికి టిక్కెట్ ఇవ్వడం స్థానిక టీడీపీ వర్గాలకు ఇష్టం లేదు. ఎందుకంటే, ఆమె స్థానికురాలు కాదు. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం నుంచి వలస వచ్చిన నేత. అయితే, అప్పుడామె ఎలా గెలిచారంటే… స్థానిక వైకాపా ఓటులో చీలిక రావడం వల్లనే అని చెప్పాలి. గత ఎన్నికల్లో వైకాపా తరఫున బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేశారు. బెల్లాన, బొత్స.. ఇద్దరూ సగం సగం ఓట్లను చీల్చుకోవడంతో మృణాళిని గెలిచారు. ఇప్పుడు, బెల్లాన చంద్రశేఖర్ కూడా వైకాపాలో ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంటే, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్సకి, స్థానిక ఎంపీ అభ్యర్థిగా ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా ఓట్లు చీలే అవకాశం లేదు.
ఇదే సమయంలో… ఈసారి టీడీపీ ఓట్లలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా టీడీపీని నమ్ముకుంటూ వస్తున్న కొచ్చర్లపాటి త్రిమూర్తులు రాజు ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినా దక్కలేదు. దీనికి పార్టీ చెబుతున్న కారణమేంటంటే… ఇప్పటికే విజయనగరం జిల్లాలో రాజులకు ఎక్కువ స్థానాలు కల్పించామని! అశోక్ గజపతిరాజు, శత్రుచర్ల విజయరామరాజు, బొబ్బిలి రాజు సుజయ్ ఉన్నారు. త్రిమూర్తులకూ టిక్కెట్ ఇస్తే… జిల్లాలో రాజులకు మాత్రమే టీడీపీ ప్రాధాన్యత ఇచ్చిందనే అభిప్రాయం కలుగుతుందనేది పార్టీ అభిప్రాయం. అలాగని, త్రిమూర్తులను ఒప్పించడంలో కూడా పార్టీ అధినాయకత్వం ఫెయిలందనే అంటున్నారు. అందుకే ఆయన రెబెల్ గా బరిలోకి దిగుతున్నారు. స్థూలంగా చెప్పాలంటే… గత ఎన్నికల్లో వైకాపాకి ఎదురైన పరిస్థితే… ఈసారి టీడీపీలో కనిపిస్తోంది. టీడీపీ రెండు వర్గాలుగా చీలుతోంది. బొత్సని ఎదుర్కొనడం కోసం టీడీపీ సరైన అభ్యర్థిని నిలబెట్టలేకపోయిందనే అభిప్రాయమే కలుగుతోంది. మృణాళినికి టిక్కెట్ ఇవ్వొద్దంటూ స్థానికులే ధర్నాలు చేసిన పరిస్థితి ఈ మధ్య కనిపించింది. కానీ, ఆ కుటుంబానికే మళ్లీ టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. ఈ లెక్కన బొత్స గెలుపు నల్లేరు మీద నడక అనే ధీమాతో వైకాపా వర్గాలున్నాయి. మరి, ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినాయకత్వం రంగంలోకి దిగుతుందో లేదో చూడాలి.