కృష్ణా జిల్లాలో ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులెవరో ఖరారయ్యారు. కానీ రెండు పార్టీల్లోనూ అసంతృప్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ జనసేన పార్టీ ప్రత్యామ్నాయం అవుతోంది. కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలున్నాయి. వీటిలో మెజార్టీ సీట్లు సాధించిన వారికి అధికారం సులువుగా అందుతంది. అందుకే అన్ని పార్టీలు కృష్ణా జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.
టీడీపీలోనూ అక్కడక్కడా అసంతృప్తి..!
గత ఎన్నికల్లో టీడీపీ పదహారు స్థానాల్లో మిత్రపక్షంతో కలిసి 11 చోట్ల విజయం సాధించింది. వైసీపీ తరపున గెలిచిన ఇద్దరు టీడీపీలో చేరారు. దీంతో.. ఆ పార్టీకి ముగ్గురే మిగిలారు. టీడీపీ దాదాపుగా పాత అభ్యర్థులతోనే రంగంలోకి దిగింది. అయితే కొన్ని చోట్ల అంతృప్తులు తప్పడంలేదు. తిరువూరులో మంత్రి జవహర్‌కు అవకాశం ఇచ్చారు. అక్కడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి స్వామిదాసు అసంతృప్తికి గురయ్యారు. నందిగామ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్యకు టిక్కెట్ ఇవ్వడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. పెడన టిక్కెట్ కాగిత వెంకట్రావు తనయుడుకి కేటాయించారు. అక్కడ బూరగడ్డ వేదవ్యాస్ టిక్కెట్ ఆశించారు. గుడివాడలో టిక్కెట్‌ను దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్‌కు ఇవ్వడంతో అసంతృప్తి బయలుదేరినా.. సర్దుబాటు చేశారు.
వైసీపీలో తిరుగుబాటు అభ్యర్థులు ఖాయమే.. !
వైసీపీ అధినేత ఒకే సారి 16 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వివాదాలకు కేంద్రంగా మారింది. అక్కడ సమన్వయ కర్తగా నియమించిన యలమంచిలి రవికుమార్‌ను కాదని బొప్పన భవకుమార్‌కు టిక్కెట్ కేటాయించారు. టిక్కెట్ హామీతోనే ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. చివరి క్షణంలో హ్యాండిచ్చారు. ఎంపీ అభ్యర్థి పీవీపీ డిమాండ్ మేరకు యలమంచిలిని మార్చినట్లు చెబుతున్నారు. దీంతో వైకాపా రెబల్‌గా పోటీ చేయాలని యలమంచిలి రవి నిర్ణయించుకున్నారు. పామర్రు నియోజకవర్గంలోనూ సీటు లభించని నేత డీవైదాస్ కూడా జనసేన వైపు చూస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా కైలే అనిల్‌కుమార్‌ను ప్రకటించారు. పెడన టిక్కెట్‌ను జోగి రమేష్‌కు ఖరారు చేశారు. సమన్వయకర్తగా ఉన్న ఉప్పాల రాంప్రసాద్ కు టిక్కెట్ లేకుండా పోయింది. విజయవాడ పశ్చిమలోనూ టిక్కెట్‌ను వెల్లంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించడంతో అక్కడ మైనార్టీలు అసంతృప్తికి గురయ్యారు. మరో వర్గం పోటీకి సిద్ధపడుతోంది. దాదాపుగా పది నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉంది. ఇది ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళన ఉంది.
జనసేనకు పెరిగిన డిమాండ్..!
రెండు పార్టీల్లో అసంతృప్తులకు జనసేన మంచి ప్రత్యామ్నాయంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పలువురితో మంతనాలు జరుపుతున్నారు. పలు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని జనసేన నేతలు పకడ్బందీగా ఉపయోగించుకుంటే… పరిస్థితి మారుతుందన్న అంచనాలున్నాయి. ఏ విధంగా చూసినా కృష్ణా జిల్లాలో జనసేన గేమ్ చేంజర్ గా కనిపిస్తోంది.