ప్రచార వ్యూహాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్టైలే వేరు. ఆయన 2014 ఎన్నికలకు ముందు అమలు చేసిన ప్రచార వ్యూహం.. అత్యంత విభిన్నం. కాంగ్రెస్ పార్టీ నేతలు చేసే ప్రతి విమర్శను.. ఆయన తన ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు. ఒకప్పుడు.. రైల్వే స్టేషన్లో మోడీ టీ అమ్ముకున్నారన్న ఓ ప్రచారం ఉంది. ఆ విషయాన్ని ఆయన ఎక్కడా చెప్పలేదు. కానీ.. అవసరమైన సందర్భంలో మాత్రం… చాయ్ వాలా పేరును ప్రస్తావిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ నేతలు చేసిన చాయ్ వాలా విమర్శలను మోడీ.. పక్కాగా ఉపయోగించుకున్నారు. చాయ్ పే చర్చా పేరుతో..ఉద్ధృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సారి కూడా.. అలాంటి వ్యూహాన్నే అమలు చేస్తున్నారు.
తాను దేశానికి కాపలాదారునని.. మోడీ చాలా కాలంగా చెబుతున్నారు. ఆ కాపలాదారు దొంగ.. అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నినదిస్తున్నారు. ఈ క్రమంలో మోడీ… గత ఎన్నికల నాటి వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. సోషల్ మీడియా వేదికగా “మై భీ చౌకీదార్” పేరిట ప్రచారాన్ని ఉధృతం చేసింది. దీనిలో భాగంగా ప్రధాని మోడీ తన ట్విట్టర్ పేరును “చౌకీదార్ నరేంద్ర మోడీ”గా మార్చారు. ఒక్క మోడీ మాత్రమే… కాదు.. బీజేపీ మద్దతుదారులందరూ.. ఇలా పేరు మార్చుకోవాలని ఆదేశించారు. దాంతో అమిత్ షా సహా.. అందరూ అదే బాట పట్టారు. ఇప్పుడు సోషల్ మీడియాలో… చౌకీదార్ ట్రెండింగ్ టాపిక్ అయింది. బీజేపీ ప్రారంభించిన ప్రచారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూడా చౌకీదార్ చోర్ హై అనే ప్రారంభించింది.
ప్రచారం విషయంలో.. మోడీని ఢీకొట్టే సామర్ధ్యం విపక్ష పార్టీల నేతల్లో ఎవరికీ లేదు. మూడు నెలల ముందునే మోడీ ప్రచార భేరీ మోగించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 100 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ బహిరంగ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆయన ప్రసంగించబోతున్నారు. అద్భుతమైన హావభావాలు, వాగ్ధాటితో ఆయన ప్రజలను ఆకట్టుకుంటున్నారు.