నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున పవన్ కల్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజులుగా.. జనసేన కోసం ఆయన యూట్యూబ్‌లో ఇతర పార్టీల జబర్దస్త్ ఆర్టిస్టులతో స్కిట్లు వేసి.. ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి ఫుల్ టైమ్ పని చేయడానికి.. ఎన్నికల్లో బరిలోకి దిగడానికి నిర్ణయించుకున్నారు.
జనసేనలోని మెగా బ్రదర్..! యూట్యూబ్‌లో అలా చెప్పారేంటి..?
జనసేన పార్టీకి, తన కుటుంబానికి ఏ సంబంధమూ లేదని… ఎవర్నీ మద్దతు కూడా అడగబోనని పవన్ కల్యాణ్ చాలా సార్లు చెప్పారు. ఇప్పటి వరకూ ఆయన విధానం అదే. గతంలో.. మెగా ఫ్యామిలీలోని నాగబాబు నుంచి అల్లు అరవింద్ వరకూ అందరూ అదే చెప్పారు. టవర్ స్టార్ నాగబాబు అయితే.. యూట్యూబ్ వీడియోల్లో.. తన తమ్ముడు జనసేన పార్టీకి, మెగా ఫ్యామిలీకి ఏ సంబంధమూ లేదని.. స్పష్టంగా ప్రకటించుకున్నారు. కొన్నాళ్ల క్రితం.. రూ. కోటి విరాళం ఇచ్చి అదే చెప్పారు. సమయం లేని కారణంగా తమ్ముడి పార్టీకి విరాళం ఇవ్వగలను కానీ.. ప్రచారం చేయలేనన్నారు. ఆ తర్వాత అభిమానులను పోలీసులు కొట్టారని.. గుంటూరు వెళ్లి… అక్కడ కూడా అదే చెప్పారు. తనకు జనసేనకు ఏ సంబంధంలేదని.. తాను జనసేన తరుపున రాలేదన్నారు. అభిమానిగా అభిమానుల్ని పరామర్శించడానికి వచ్చానన్నారు. ఈ డైలాగులన్నీ… యూ ట్యూబ్‌లో వైరల్ అవుతూండగానే… కొత్తగా.. ఆయన జనసేన తరపున ఎన్నికల బరిలో నిలబడటానికి వచ్చేశారు.
పవన్ చెప్పిందానికి నాగబాబు టిక్కెట్‌కి మ్యాచ్ కావట్లేదేంటి..?
సాధారణంగా ఓ వ్యక్తి క్రేజ్ మీద ఆదారపడి పురుడు పోసుకునే పార్టీలు.. ముందుగా.. ప్రజాభిమానం పొందడానికి… కుటుంబ సభ్యులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు… చిరంజీవి… తన సోదరులతో పాటు.. అందర్నీ పార్టీ కోసం ఉపయోగించుకున్నారు… కానీ ఎన్నికల్లో పోటీకి మాత్రం అవకాశం చివరి నిమిషంలో.. ఒక్క అల్లు అరవింద్ కి మాత్రమే దక్కింది. నాగబాబుకు కూడా అప్పట్లో అవకాశం దొరకలేదు. పీఆర్పీ కోసం.. మామిడి తోటల్లో అభిమానులతో సమావేశాలు పెట్టి ఆయనే ఎక్కువగా కష్టపడ్డారు. అయితే ఇలాంటి పార్టీలు ఒక సారి ప్రజాభిమానం పొందిన తర్వాత.. కుటుంబసభ్యులకు కావాల్సినన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. కానీ జనసేన మాత్రం.. ఈ విషయంలో… చాలా అడ్వాన్స్డ్గా ఉంది. పార్టీ కోసం ఇంత వరకూ ఎలాంటి పని చేయకపోయినా.. నేరుగా నాగబాబును రంగంలోకి దింపుతున్నారు.
పవన్ కూడా “గిరీశం మార్క్” పొలిటీషియనే..!
పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ విషయంలో చాలా సిద్ధంతాలు చెప్పారు. టిక్కెట్ల ఖరారు కోసం ధరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారికే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలో ఎ టెస్ట్ కూడా పెట్టారు. ఆ ఫోటోలు.. రోజూ.. జనసేన అధికారిక ట్విట్టర్లో పెట్టారు కూడా. పవన్ కల్యాణ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు రెండు చోట్ల పోటీ చేసే అవకాశాన్ని ఎన్నికల కమిటీ ఇచ్చింది. ఇప్పుడు.. అన్న నాగబాబు మాత్రం.. ఏ టెస్ట్ లేకుండా.. నేరుగా… హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో వచ్చేసి.. టిక్కెట్ అందుకుంటున్నారు. సామాజికవర్గం ఓట్ల అండా దండా ఉంటుందని భావిస్తున్న నియోజకవర్గం నుంచి పోటీకి బరిలోకి దిగుతున్నారు. రాజకీయాల గురించి ఎన్నెన్ని మాటలు చెప్పినా… చివరికి గిరీశం డైలాగ్ దగ్గరకు పోవాల్సిందే. ఓపీనియన్ ఛేంజ్ చేసుకునే వాడే రాజకీయ నాయకుడని… అప్పట్లోనే గిరీశం అన్నాడు..! అదే ఇప్పుడు నిజం చేస్తున్నారు..!