నర్సాపురం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఖాయమయింది. జనసేన తరపున పనన్ కల్యాణ్ సోదరుడు నాగేంద్రబాబును రంగంలోకి దింపక పోతే… పోటీ రెండు పార్టీల మధ్యే ఉండదని.. భావించేవారు. కానీ.. నేరుగా నాగేంద్రబాబు రంగంలో ఉండటం.. ఈ నియోజకవర్గం పరిధిలోనే పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం కూడా ఉండటంతో… పోటీ ఆసక్తికరంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నా వెంటనే నాగేంద్రబాబుకి.. పవన్ కల్యాణ్ లోక్సభ టిక్కెట్ బీఫాం అందించారు.
నరసాపురం నియోజకవర్గంలో.. ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలన్నీ.. క్షత్రియసామాజికవర్గానికి ఎక్కువగా సీట్లు కేటాయిస్తూంటాయి. ఉభయగోదావరి జిల్లాలో వివిధ సామాజికవర్గాలకు అవకాశం కల్పించే క్రమంలో… నర్సాపురం వద్దకు వచ్చే సరికి.. అది క్షత్రియులకోటాలో పడిపోయేది. ఇప్పుడు కూడా ప్రధాన పార్టీలు.. అంటే.. టీడీపీ, వైసీపీ…క్షత్రియ సామాజికవర్గం అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. టీడీపీ తరపున బరిలోకి దిగాల్సిన రఘురామకృష్ణంరాజు.. చివరి నిమిషంలో వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు మరింత వ్యూహాత్మకంగా ఆలోచించి.. క్షత్రియవర్గంలో మంచి పలుకుబడి ఉన్న ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును… అభ్యర్థిగా నిర్ణయించారు. కలువపూడి శివగా.. ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకుని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్న శివరామరాజు..రఘురామకృష్ణంరాజుతో హోరాహోరీ తలపడనున్నారు.
ఈ లోపే… పవన్ కల్యాణ్.. తన సోదరుడ్ని అదే నియోజకవర్గం నుంచి నిలబెట్టాలని నిర్ణయించారు. ఇది కూడా వ్యూహాత్మకమే. ఎందుకంటే.. గతంలో నర్సాపురం నుంచి కాపు సామాజికవర్గం నేతలు పలువురు విజయం సాధించారు. చేగొండి హరిరామజోగయ్య, కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి వాళ్లు.. కాంగ్రెస్, టీడీపీ తరపున పోటీ చేసి.. విజయం సాధించారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. పైగా భీమవరం నుంచి నేరుగా పవన్ కల్యాణ్ రంగంలో ఉంటున్నారు. సామాజిక సమీకరణాల రీత్యా చూస్తే.. కాపు సామాజికవర్గం ఓటర్లు అంతా ఐక్యంగా… నాగబాబుకు మద్దతిస్తారని… అదే సమయంలో.. ఇతర ఓటర్లు.. టీడీపీ, వైసీపీ మధ్య చీలిపోతారన్న అంచనాలను.. జనసేన పార్టీ వ్యూహకర్తలు వేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే… నాగబాబును అక్కడ రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతోంది.