ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన హాట్ టాపిక్ గా మారింది. ఆ పార్టీపై… టీడీపీ పెద్దగా విమర్శలు చేయడం లేదు కానీ… జగన్‌కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్, ఆ పార్టీకి చెందిన మీడియా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఏం చేసినా… టీడీపీతో జత పెట్టి విమర్శలు చేస్తున్నారు. టీడీపీతో లోపాయికారీ అవగాహన ఉందంటున్నారు.
లక్ష్మినారాయణ జనసేనలో చేరడం కూడా తప్పేనా..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఏం చేయాలో , ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో… ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలన్నట్లుగా పరిస్థితి మారింది. పవన్ కల్యాణ్ .. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక తానేం చేయాలో జగన్మోహన్ రెడ్డిని పవన్ కల్యాణ్ అడిగి చేయాలన్నట్లుగా వ్యవహారం ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా పోటీ చేస్తే.. అదిగో… చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం లేదు.. అధికార వ్యతిరేక ఓట్లు చీల్చి టీడీపీకి మేలు చేయాలనుకుంటున్నారని విమర్శలు చేస్తారు. పొత్తులు పెట్టుకుంటే… అదిగో ముందు నుంచే చెబుతున్నాం.. వారిద్దరూ ఒకటే అని ఆరోపిస్తారు. ఏం చేసినా ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ.. జనసేనలో చేరారు. అంతకు ముందు ఆయన టీడీపీలో చేరాలనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రధాన మీడియాలో వచ్చింది. దీనిపై వైసీపీ తీవ్రంగా స్పందించారు. తాము ముందు నుంచి చెబుతున్నట్లుగా… చంద్రబాబు చెప్పినట్లు లక్ష్మినారాయణ చేశారని.. ఇప్పుడు వారి ముసుగులు తొలగిపోయాయని చెప్పుకొచ్చారు. ఆయన టీడీపీలో చేరలేదు. కానీ.. జనసేనలో చేరారు. దాంతో.. మళ్లీ.. చంద్రబాబునే… సీబీఐ మాజీ జేడీని జనసేనలోకి పంపారని.. విమర్శలు చేయడం ప్రారంభించారు. వీవీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోనూ చేరకుండా సొంత పార్టీ పెట్టుకోవాలని చాలా మంది ఆశించారు. కానీ సొంత పార్టీ పెట్టుకుంటే నెట్టుకు రావడం కష్టం కాబట్టి.. ఆయన జనసేన వైపు చూశారని అనుకోవచ్చు. దీన్ని కూడా కుట్ర అని అంటే ఎలా.. ?. ఒక వేళ ఆయన బీజేపీలో చేరి ఉన్నా.. ఇలాంటి విమర్శలు చేసేవారేమో…? ఆయన బీజేపీలో చేరి ఉంటే.. టీడీపీ, బీజేపీ మధ్య లోపాయికారీ సబంధాలలకు సాక్ష్యం అనేవారు. లక్ష్మినారాయణ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన అధికారి కాబట్టి.. అక్కడ బీజేపీ నేతలతో… కలిసి కుట్ర చేశారని చెప్పేవారు. దానికి గతంలో… టీటీడీ మెంబర్లో ఓ మహారాష్ట్ర బీజేపీ నేత సతీమణికి.. పదవి ఇచ్చిన విషయాన్ని సాక్ష్యంగా.. చెప్పేవారేమో..?. బీజేపీలోకి….తన భవిష్యత్ వ్యూహాల కోసం..చంద్రబాబునాయుడే పంపారని.. ఆరోపించొచ్చు. ఏం చేసినా ఆరోపించడం సహజం అయిపోయింది.
మాయవతితో పొత్తులు పెట్టుకున్నా కుట్రేనా..?
జనసేనకు.. తన రాజకీయ వ్యూహాలను అనుసరించే హక్కు ఉంది. లక్ష్మినారాయణ వెనుక లక్షలాది మంది ఓటర్లు ఉన్నట్లు వైసీపీ భావిస్తే ఎవరూ ఏమీ చేయలేరు. ఆయన మంచి ఇమేజ్ ఉన్న అధికారి, మంచి వ్యక్తిగా అందరికీ తెలుసు. అంతే కానీ.. ఆయన గొప్ప మాస్ లీడర్ అని ఎవరూ చెప్పడం లేదు. ఆయన వెనుక లక్షలాది మంది ఓటర్లు ఉన్నారని ఎవరూ అనుకోవడం లేదు. అలా ఉంటే.. ఆయన పార్టీ పెట్టుకుని ఉండేవారు కదా..!. అయినా జనసేనలో చేరడాన్ని కుట్రగా ఎందుకు సిద్ధాంతం చెబుతున్నారో. జనసేన పార్టీ.. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. రాజకీయంగా ఇది మంచి ఎత్తుగడే. అయితే.. తమ దళిత ఓటు బ్యాంక్‌ను చీల్చడానికి చంద్రబాబు వ్యూహం ప్రకారం… పవన్ కల్యాణ్.. మాయావతితో పొత్తు పెట్టుకున్నారని.. వైసీపీ ఆరోపిస్తోంది. మరి జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో… వైసీపీ చెబుతుందా..?. ఏ రాజకీయ పార్టీ విధానం ఆ పార్టీది. వైసీపీ.. నేరుగా పొత్తులు పెట్టుకోకపోవచ్చు కానీ.. దొడ్డి దోవన బీజేపీతో అవగాహనకు వచ్చిందని.. స్టింగ్ ఆపరేషన్లు కూడా బయటపెట్టాయి. అందుకే.. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి..? ఎవరు ఏ పార్టీలో చేరాలి..? ఇలాంటి వాటితో.. వైసీపీ నేతలు లిస్ట్ ఇస్తే దాని ప్రకారం చేయాలన్నట్లుగా.,. ఉంది వ్యవహారం. అలా ఇస్తే ఏ గొడవా ఉండదు కదా..!
పవన్ కు రాజకీయ నిర్ణయాలు తీసుకునే హక్కు లేదా..?
రాజకీయాల్లో ఎవరితో ఎవరు అయినా పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు తోడు.. చివరికి పవన్ కల్యాణ్.. చంద్రబాబుతోనే కలుస్తారని వైసీపీ నేతలు కొత్తగా ఆరోపణలు చేస్తున్నారు. కలవలేదు కదా..! తర్వాత ఏం జరుగుతుందో కానీ.. ఇప్పుడైతే… అలాంటిదేమీ లేదు కదా..!. జగన్, పవన్, మోదీ, కేసీఆర్ ఒకటని.. టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపించారు. ఇప్పుడు ఆ లిస్ట్ నుంచి పవన్ ను పక్కకు తీసేశారు. అంటే వారు అప్పుడు ఆరోపణలు చేస్తే.. నిజంకాలేదు కదా..! ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి… ఎన్నికల తరవాత చంద్రబాబుతోనే పవన్ కల్యాణ్ కలుస్తారని ఆరోపిస్తున్నారు. అలా ఎందుకు జరగాలి..? అంటే… పవన్ కల్యాణ్ ఏం చేసినా.. వైసీపీ విమర్శిస్తోంది. కానీ.. జనసేనకు.. తన రాజకీయ నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉంది. వ్యూహాలను అమలు చేసుకునే హక్కు ఉంది.