ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ఎట్టకేలకు దొరికాడు. ఆయన లండన్ లో అరెస్టు కావడం ఇప్పుడు దేశవ్యాప్తం సంచలనమైంది. ఓవారం కిందటే ఈడీ లెటర్ రాయడం, రెండ్రోజుల కిందటే అరెస్ట్ వారెంట్ జారీ కావడం చకచకా జరిగాయి. నీరవ్ ఇన్నాళ్లకైనా అరెస్ట్ కావడం మంచి పరిణామమే. అయితే, నీరవ్ అరెస్టు రాజకీయ కోణం నుంచి చూస్తే… భాజపాకి మరో బలమైన ప్రచారాంశంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చౌకీదార్ అంటూ భాజపా నేతలందరూ వారి పేర్లముందు ఓ బిరుదులా పెట్టేసుకుని మరీ ప్రచారం చేసుకుంటారు. దీన్ని తిప్పికొడుతూ కాంగ్రెస్ నేతలు ‘చౌకీదార్ కాదు చోర్’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో నీరవ్ ని పట్టుకొచ్చి… దేశ్ కీ చౌకీదార్ తామేనని మరోసారి నిరూపించుకున్నామని భాజపా ప్రచారం చేసుకుంటుంది.
సర్జికల్ స్ట్రైక్స్ తరువాత, దాదాపు అదే స్థాయిలో భాజపాకి పనికొచ్చే ప్రచారాంశం ఇది. నీరవ్ అరెస్ట్ పై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా స్పందిస్తూ… నీరవ్ మోడీని పట్టుకోవడం కచ్చితంగా మోడీ ప్రభుత్వ విజయమా, అయితే ఆయన్ని భారతదేశం నుంచి బయటకి పంపించింది ఎవరంటూ ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత గులామ్ నబీఆజాద్ స్పందిస్తూ… నీరవ్ మోడీ దేశం దాటి వెళ్లడానికి భాజపా సహకరించిందనీ, ఇప్పుడు వాళ్లే తిరిగి తీసుకొచ్చారనీ, ఎన్నికల కోసమే ఆయన్ని అరెస్ట్ చేశారనీ.. ఎన్నికలు పూర్తవగానే మళ్లీ క్షేమంగా లండన్ పంపించేస్తారంటూ ఎద్దేవా చేశారు. నీరవ్ మోడీ అరెస్టు అనేది ఇప్పుడు ప్రచారం చేసుకున్నంతగా భాజపా విజయం కానేకాదు. కానీ, ఆ క్రెడిట్ కోసం పాకులాడుతున్న సమయంలో… ఆయన చేసిన మోసానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? నీరవ్ దేశం విడిచి పారిపోవడానికి బాధ్యత ఎవరు వహించాలి? దొంగతనం వల్ల జరిగిన నష్టం కంటే, దొంగను పట్టుకోవడమే గొప్ప అన్నట్టుగా వ్యవహరిస్తే ఎలా..?
ఈ సందర్భంలో… ఒక జాతీయ పార్టీ అయిన భాజపా ప్రచార సరళిపై చర్చ జరగాలి. ఈ మధ్యనే పుల్వామా ఘటనను రాజకీయం చెయ్యకూడదంటూనే… భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు నీరవ్ అరెస్టును కూడా విజయంగా చెప్పుకుంటున్న పరిస్థితి! ఇవి ఎన్నికల ప్రచారానికి వాడదగ్గ అంశాలా..? ఇలాంటి సందర్భాల్లో కూడా ఒక జాతీయ పార్టీగా కొంత విజ్ఞత ప్రదర్శించాల్సిన అవసరం లేదా..? పరిపాలనలో విజయాలను వెతుక్కోవడం మానేసి… ఇలాంటి అంశాలపై ఆధారపడుతున్న తీరుపై సగటు పౌరుడు పెదవి విరుస్తున్నాడని భాజపా నేతలు గుర్తించడం లేదేమో!