ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాను లోక్ సభకి పోటీ చేయడం లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. సమాజ్ వాదీ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ప్రస్తుతం యూపీలో ఈ కూటమిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల తరువాత కేంద్రంలో ఈ కూటమి కీలకం కాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదనుగుణంగానే కాంగ్రెస్ కూడా ఎస్పీ, బీఎస్పీలు పూర్తిగా దూరంగా ఉంటున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో లోక్ సభకు పోటీ చెయ్యనంటూ ప్రకటించారు మాయావతి. దీనికి ఆమె చెబుతున్న కారణం… తాను పోటీలో ఉంటే తనవారంతా సొంత నియోజక వర్గంలోనే పరిమితమౌతారనీ, తాను కూడా కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుందన్నారు. తాను కావాలనుకుంటే ఎప్పుడై ఎంపీ కాగలనని ధీమా వ్యక్తం చేశారు.
మాయావతి నిర్ణయం వ్యూహాత్మకమే. ఎందుకంటే, ప్రస్తుతం యూపీలో కూటమికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ ప్రచారం చేసి గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే, ఆమె ప్రధాని అభ్యర్థి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! అలాంటిది, ఆమె పోటీ చేయకపోవడమేంటి అనే అభిప్రాయలు కొన్ని సహజంగానే వినిపిస్తాయి. కానీ, వాస్తవ పరిస్థితి చూస్తే… 80 సీట్లలో దాదాపు 40 నుంచి 45 సీట్లు మాయావతి కూటమి గెలుస్తుందనే అంచనాలున్నాయి. ఎన్నికలు ఫలితాలు ఇలాగే ఉంటే.. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకీ లేనన్ని ఎంపీ స్థానాలు మాయావతి చేతిలో ఉన్నట్టు లెక్క.
కాస్త కష్టపడితే… జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి మాయావతి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే, ఫోకస్ అంతా కూటమి ఎంపీ అభ్యర్థులను గెలిపించడంపై పెట్టడం కోసమే ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని అనుకోవచ్చు. గత ఎన్నికల్లో మాయావతి ప్రాతినిధ్యమే ఢిల్లీలో లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమెకి ఓపక్క భాజపాని ఓడిస్తూనే… కాంగ్రెస్ కి ఎక్కువ సంఖ్యలో సీట్లు రాకుండా చేసుకోవాలి. ఈ లక్ష్యాలన్నీ నెరవేరాలంటే ఎంతో వ్యూహాత్మకత అవసరం. ఇతర ప్రాంతీయ పార్టీలతో పోల్చితే ఈ లోక్ సభ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మాయావతి తీసుకున్నారని అనొచ్చు.