ఎన్నికలంటే.. ఓ గేమ్. ఆ గేమ్‌లో .. ఆటగాళ్లు ప్రజలే. ఆడించేది.. ఓడించేది.. గెలిపించేది కూడా ప్రజలే. అంతా తాము చేస్తున్నామని నేతలు అనుకుంటారు కానీ… ఎన్నికల సమయంలో మాత్రం.. అసలు గేమ్ ఆడేది ఓటర్లు. ఈ విషయాన్ని ప్రతి ఎన్నికల్లోనూ ఓటర్లు తమదైన పద్దతిలో వెల్లడిస్తూనే ఉన్నారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ అంతటి నాయకుడికే కల్వకుర్తిలో ప్రజలు షాక్ ఇచ్చారు. ఓట్లు వేయకపోతే ఎవరూ నాయకులు కాలేరని తీర్పు ఇచ్చారు. దాదాపుగా ప్రతి ఎన్నికలోనూ.. అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖులు ఓడిపోతూనే ఉన్నారు.
2009లో మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లులో పోటీ చేశారు. రెండో స్థానంగా తిరుపతిలో కూడా పోటీ చేశారు. అందరూ… పాలకొల్లులో చిరంజీవి ఈజీగా గెలుస్తారని అంచనా వేశారు. ఆయన సామాజికవర్గం ఓట్లు, అప్పట్లో ప్రజారాజ్యం క్రేజ్, అన్నయ్య సీఎం అవుతారన్న మెగా ఫ్యాన్స్ ఉరకులు.. ఇలా… పైగా.. ఉభయగోదావరి జిల్లాల్లో పీఆర్పీ వేవ్ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా ఆయన ఓ మహిళా అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. తేడా కూడా భారీగానే ఉంది. ఇది ఓ రకంగా ఆ ఎన్నికల్లో షాకింగ్ రిజల్ట్. చిరంజీవి ముందు జాగ్రత్తగా.. తిరుపతి నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ గెలిచారు కాబట్టి… సరిపోయింది. లేకపోతే.. మొత్తానికే తేడా కొట్టేది. 2014 ఎన్నికలలో ఆ కోటా … వైసీపీకి దక్కింది. తల్లి విజయలక్ష్మిని విశాఖపట్నం నుంచి నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ కు.. ఆయన కుటుంబానికి ఓటమి అప్పటి వరకూ ఎదురు కాలేదు. కానీ కడప బయట ఎప్పుడూ వారు పోటీ చేయలేదు. కానీ తొలి సారి తల్లిని విశాఖలో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆమె ఘోరంగా పరాజయం పాలయ్యారు. టీడీపీ చేతిలో ఓడినా కాస్తంత పరువైనా దక్కేదేమో కానీ… టీడీపీ మద్దతిచ్చిన బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఓటమి ఎరుగని వైఎస్ కుటుంబ రాజకీయ పతానికి అది మొదటి దిగుడుమెట్లుగా మారింది. ఆ తర్వాత కడప జిల్లాలో ఎమ్మెల్సీ స్థానంలో కూడా వైసీపీ ఓడిపోయింది.
ఈ ఎన్నికల్లోనూ అలాంటి ఫలితం వస్తుందా.. అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ప్రధానంగా.. మూడు నియోజవర్గాలపై చర్చ నడుస్తోంది. అందులో మొదటిది… నారా చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం. అదేమీ .. సామాజికవర్గ పరంగా.. కంచుకోట కాదు. టీడీపీకి పట్టున్న నియోజకవర్గం కాదు. అయినా.. లోకేష్ రంగంలోకి దిగారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడేం జరుగుతుందన్న చర్చ ప్రారంభమయింది. అలాగే.. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం. చిరంజీవి ఓడిపోయిన వ్యవహారం చర్చకు రావడానికి పవన్ భీమవరం పోటీ కూడా ఓ కారణం. అక్కడ ఓటర్లు పవన్ ను.. ఎలా చూస్తారనేది కీలకం. ఆయన గాజువాక నుంచి కూడా పోటీ చేస్తూండటంతో.. అక్కడి ఓటర్లు గెలిపిస్తారులే అనుకుంటే.. మొత్తానికే మోసం వస్తుంది. ఇక.. చివరిగా.. కడప పార్లమెంట్ నియోజకవర్గంపైనా ఇలాంటి చర్చే జరుగుతోంది. ఎందుకంటే.. ఈ సారి టీడీపీ తరపున ఆదినారాయణరెడ్డి పోటీ పడుతున్నారు. గతంలో పోలిస్తే రాజకీయాలు మారిపోయాయి. నియోజవకర్గాల్లో మార్పులొచ్చాయి. అందుకే… అన్నీ అనుకున్నట్లుగా ఉండవని. .. ఈ సారి కూడా.. ఏదో ఓ “పొలిటికల్లీ షాకింగ్” రిజల్ట్ ఉంటుందని అంటున్నారు.