ఆయనో జర్నలిస్ట్. స్క్రీన్ మీదకు కూడా వస్తూంటారు కాబట్టి… పేరు తెలియకపోయినా మొహం తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఉండే పొలిటికల్ ఫ్యాన్స్‌కు అయితే.. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే జర్నలిస్ట్ సాయిగా చిరపరిచితుడే. ఎందుకంటే.. పవన్ కల్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేసి.. ఇక గెలవడమే తరువాయన్నట్లుగా.. ఆయన వీడియోలు పెడుతూంటారు. అందరూ ఆయన పవన్ కల్యాణ్ కావాలి.. పవన్ కల్యాణ్ రావాలి అని కోరుకున్న వ్యక్తి అని అనుకుంటారు. అలా భావించే ఆయనను…పవన్ కోసం అన్నట్లుగా పెట్టిన చానల్ యాజమాన్యం ఏరికోరి పగ్గాలప్పగించింది. కానీ ఇప్పుడేం జరిగింది..? ఆయన మాట్లాడిన ఓ ఆడియో బయటకు వచ్చింది. ముసుగును తొలగించేసింది.
ఆ “జనసేన జర్నలిస్ట్”… ముసుగు తీస్తే వైసీపీ వచ్చిందేంటి..?
జర్నలిస్ట్ సాయి.. ఇంకా పూర్తి స్థాయిలో ప్రసారాలు ప్రారంభం కాని ఓ చానల్లో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూంటారు. అవి ఎక్కువగా.. “ప్రొ జనసేన” కాన్సెప్ట్‌తో ఉంటాయి. ఏ పార్టీ మద్దతుదారులు.. ఆ పార్టీకి మాట్లాడుతూ ఉంటారు కామనే. జనసేన వాయిస్ ఈ చానల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే..పవన్ కు మద్దతుగా ప్రచారం కోసమే ఆ న్యూస్ చానల్ ను లాంఛ్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ చానల్ నిర్వహణ చూస్తున్న సాయి మాత్రం.. డిబేట్‌కు వచ్చే వారికి… డిఫరెంట్ ఐడియాలు ఇస్తున్నారు. జనసేనను బ్లేమ్ చేసేలా.. వైసీపీకి లాభం కలిగేలా… వైసీపీ నేతల వాదనకు.., మద్దతుగా ఎలా వాదన వినిపించేలా ఫీడింగ్ ఇస్తూ దొరికిపోయారు. ఆయన ఎంత గొప్ప ముసుగు మనిషో గుర్తు చెప్పడానికన్నట్లుగా ఎవరో రికార్డు చేసి ఆడియోను ఆన్ లైన్లో పెట్టడంతో అది వైరల్ అయిపోయింది.
యూట్యూబ్ చానల్ ఆదాయం కోసం పవన్ ఫ్యాన్స్‌ను వాడేసుకున్నారు..!
మామూలుగా అయితే… వైసీపీకి మద్దతుగా మాట్లాడితే.. ఆయన సపోర్టర్ అని ఊరుకుంటారు. జర్నలిస్ట్‌కు అయినా రాజకీయ అభిప్రాయాలు ఉంటాయనుకుంటారు. కానీ ఈ జర్నలిస్ట్ సాయి బతక నేర్చిన వ్యక్తి. యూ ట్యూబ్ చానల్ పెట్టుకుని దండిగా సంపాదించవచ్చని.. ఓ ఐడియా వచ్చిన తర్వాత.. ఆ చానల్‌కు సబ్స్క్రైబర్లు కావాలంటే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కరెక్ట్ అనుకున్నారు. పవన్ కు .. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉండటంతో.. ఆయన జనసేన, పవన్ కల్యాణ్ గురించి సూపర్ పాజిటివ్ వీడియోలు పెట్టారు. తమ నేత గురించి చెబుతున్నారు కాబట్టి… ప్రొత్సహిద్దాం అని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సబ్‌స్క్రైబ్ అయ్యారు. రెండు లక్షలకుపైగా ఆయన యూ ట్యూబ్ చానల్ కు సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆయన పవన్ గురించి పెట్టే వీడియోలకు.. లక్షల వ్యూస్ వస్తూంటాయి. దాంతో ఆయన నెలకు రూ. 5 లక్షల వరకూ వెకకేస్తూంటారని చెబుతూంటారు. పవన్ ఫ్యాన్స్‌ను ఇంతగా వాడేసుకుంటున్న ఆయన తెర వెనుక మాత్రం.. తేడాగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ గురించి చెడుగా ఫీడ్ బ్యాక్ ఇస్తూ.. దొరికిపోయారు.
పవన్ ఫ్యాన్స్‌లో గగ్గోలు రేపుతున్న జర్నలిస్ట్ సాయి వ్యవహారం..!
ఆయన వ్యవహారం ఆడియో క్లిప్‌తో బయటకు వచ్చిన తర్వాత దీని గురించి వివరణ అంటూ.. మరో వీడియో పెట్టారు. కానీ.. నిమిషంన్నర వీడియోకి ఏడు నిమిషాల వివరణ ఇచ్చారు కానీ… అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో.. చెప్పలేదు. ఏదేదో చెప్పుకొచ్చారు. చివరికి దాన్ని తప్పు పట్టడం విచిత్రం అన్న కోణంలో సూత్రీకరించారు. ఆయన చెప్పిన కోణంలో తప్పేమీ లేదు. టీడీపీ, జనసేన మధ్య అండర్ స్టాండింగ్ ఉంది అన్నట్లుగా ప్రచారం చేయాలన్నది వైసీపీ విధానం. దీన్నే ఆయన అందరికీ ఎక్కిస్తున్నారు. జనసేన పార్టీ తరపున ఏకపక్షంగా బయటకు మాట్లాడుతూ… తెర వెనుక మాత్రం… వైసీపీ కోసం మాట్లాడుతున్న తీరే తప్పు. డబ్బుల కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను వాడుకునేందుకు బయటకు ఓ మాట.. తన రాజకీయ అభిప్రాయం ప్రకారం… విధుల్లోనూ..ఇతర పార్టీలకు మేలు కలిగేలా చర్చల్లో వ్యాఖ్యలు వినిపించేలా చేయడానికి మరో మాట చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఆయన బతకనేర్చినోడు కదా..!