కృష్ణా జిల్లాపై ప్రధాన పార్టీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. అభ్యర్ధలు ఎంపికలో ఇరు పక్షాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఓడిపోతారని భావించిన స్థానాలలో గెలుపు గుర్రాలను రంగంలోకి దించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెజవాడ పార్లమెంట్ కు వైసీపీ అనూహ్యంగా అభ్యర్ధిని మార్చింది. కోనేరు ప్రసాద్ గత ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిపోయి రాజకీయాల నుంచి తప్పుకోగా, ఈ సారి తొలుత దాసరి జై రమేష్ తెరపైకి తెచ్చారు. చివరి నిముషంలో ఆయన తప్పుకోవడంతో పొట్లూరి వరప్రసాద్‌ను రంగంలోకి దించారు. తెలుగుదేశం తరుపున సిట్టింగ్ ఎంపి కేశినేని నాని రంగంలోకి దిగారు. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ తో పాటు కనకదుర్గమ్మ వద్ద ఫ్లై ఓవర్, టాటా ట్రస్టు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సేవలపై నానికి విజయం తధ్యమని ఆ పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైసిపి తరుపున బొప్పన భవకుమార్, జనసేన నుంచి బత్తిన రాము అభ్యర్ధులుగా బరిలోకి దిగారు. వరుసగా రెండవ సారి బరిలోకి దిగిన గద్దె రామ్మోహన్ తనదే విజయం అంటున్నారు. వైసిపిలో చేరిన యలమంచిలి రవి టిక్కెట్ వస్తుందని భావించారు. కానీ, చివరి నిముషంలో వైసిపి భవకుమార్ ను రంగంలోకి దించింది. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమ, వైసిపి తరుపున మల్లాది విష్ణు, వామపక్షాలు, జనసేన తరుపున సిపియం నేత బాబూరావు బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో వైసిపి కీలక నేతగా ఉన్న వంగవీటి రాధా తెలుగుదేశంలో చేరడం టీడీపీకి ప్లస్‌గా మారింది. బాబూరావు చీల్చే ఓట్లు కూడా వైసిపికి మైనస్ గా మారనున్నాయి. ఇక పశ్చిమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖతూన్ రంగంలోకి దిగారు. ఆమె ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇక్కడ తెలుగుదేశం నేతలు నాగుల్ మీరా. బుద్దా వెంకన్న ఖతూన్ కు మద్దతు ఇస్తున్నారు. వైసిపి తరుపున మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీలో ఉండగా, జనసేన తరుపున పోతిన మహేష్ తన అదృష్టాన్ని పరిక్షీంచుకుంటున్నారు. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎస్సీలు కూడా గణనీయసంఖ్యలో ఉన్నారు. వీరి తీర్పే ఇక్కడ అభ్యర్ధల గెలుపోటములను శాసించనుంది.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మైలవరం, నందిగామ, జగ్గయ్యపేటలో దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, శ్రీరాంతాతయ్య రంగంలోకి దిగగా, వైసిపి తరుపున నందిగామలో జగన్మోహనరావు, జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను, బరిలో ఉన్నారు. మైలవరంలో వైసిపి అభ్యర్ధిగా వసంతకృష్ణ ప్రసాద్ బరిలో ఉన్నప్పటికీ దేవినేని ఉమ ఎన్నికల వ్యూహం ఎదుట వసంత కృష్ణ ప్రసాద్ ఎంతవరకు నిలబడగలుగుతారనేదే ప్రశ్నగా మారింది. తిరువూరులో తెలుగుదేశం వర్గాలు కలిసి పనిచేస్తు జవహర్ గెలవడం ఖాయమని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలో జనసేన అభ్యర్ధులు చీల్చే ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తాయోనని ఇరు పక్షాలలో ఆందోళన బయలుదేరింది.
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపి కొనకళ్ల నారాయణ మళ్లీ బరిలోకి దిగగా, వైకాపా తరుపున వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. గతంలో తెనాలి, నర్సరావు పేట, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కానీ తెనాలి నుంచి మాత్రమే గెలుపొందారు. ఆయన మచిలీపట్నానికి వచ్చారు. ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలలో వచ్చే మెజారిటీతో తమ అభ్యర్ధి గెలుపొందుతారని తెలుగుదేశం ధీమా వ్యక్తం చేస్తుంది. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాతినిధ్యం కల్పించింది. గన్నవరంలో వల్లభనేని వంశీ, పెనమలూరులో బోడే ప్రసాద్, అవనిగడ్డలో బుద్ద ప్రసాద్, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, పామర్రులో ఉప్పులేటి కల్పనకు తిరిగి టిక్కెట్ ఇచ్చారు. వైసిపి కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి అవకాశం కల్పించింది. పెడనలో జోగి రమేష్ కు టిక్కెట్ ఇవ్వడంతో అక్కడ ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ఉప్పాల రాంప్రసాద్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆయన జోగి రమేష్ కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. గుడివాడ బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసిపి అభ్యర్ధి కొడాలి నానిపై తెలుగుదేవం తరుపున దేవినేని అవినాష్ రంగంలోకి దిగారు. దేవినేని నెహ్రూ కుమారుడైన అవినాష్ కు ఆర్ధిక, అంగ బలాలు పుష్కలంగా ఉన్నాయి, అవినాష్ రంగంలో ఉండటం, నానికి చెమటలు పట్టిస్తుంది. సంప్రదాయంగా తెలుగుదేశం పార్టీకి బలమైన జిల్లాగా ఉండటంతో… ఈ సారి ఫలితాలపై ఆసక్తి ఏర్పడుతోంది.