ఈ సారి ఎన్నికల్లో మైండ్ గేమ్ కీలకంగా మారుతోంది. ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయడానికి .. ద్వితీయ శ్రేణి నేతల్ని పెద్ద సంఖ్యలో చేర్చుకోవడానికి రెండు పార్టీలు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందులో కోసం.. లక్షల్లో ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రత్యర్ధి పక్షంలో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలపై ఇతర పార్టీలు వల విసురుతున్నాయి. అడిగినన్ని డబ్బులు, అధికారంలోకి వస్తే పదవులు ఆశతో వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఈ మైండ్ గేమ్‌లో పక్కా రిపోర్ట్ ఇవ్వడంతో దాని ప్రకారం.. వైసీపీ కార్యాచరణ ప్రారంభించిందన్న ప్రచారం జరుగుతోంది.
కృష్ణాజిల్లా అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జగన్ బహిరంగ సభలో వైసీపీలో చేరిపోయారు. నిజానికి బ్రాహ్మణయ్య చనిపోయిన తర్వాత ఆయన కుమారుడికి టిక్కెట్ ఇచ్చి గెలిపించింది టీడీపీ. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు అంత కన్నా ఎక్కువే చేస్తామని చెప్పి.. పార్టీలోకి తీసుకున్నారు. గుంటూరుజిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఉన్న జానీమూన్ ను కూడా వైసీపీ పార్టీలో చేర్చుకుంది. వైసీపీ అధికారంలోకి వస్తే మంచి పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. ఆమె వల్ల.. పార్టీకి ఒరిగే లాభం ఏమీ ఉండదని..వైసీపీ నేతలకు తెలుసు. కానీ.. జడ్పీ చైర్పర్సన్ స్థాయి వ్యక్తి తమ పార్టీలో చేరారని ఘనంగా ప్రచారం చేసుకోవడానికి బాగుంటుందని ఖర్చుకు వెనుకాడలేదు. ఇక ద్వితీయ శ్రేణి నాయకత్వంపై కూడా వైసీపీ కన్నేసింది. ఆయా మండలాల్లో ప్రభావం చూపే నేతలను కూడా దగ్గరకు తీయడం ప్రారంభించింది. మండలస్థాయి నేతలను టోకున కొనుగోలు చేయడం ప్రారంభించారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఆర్ధికంగా బలహీనంగా ఉంటే వారిని గుర్తించి వారికి డబ్బు వల విసురుతున్నారు.
తెలుగుదేశం పార్టీ కూడా జోరుగానే ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతోంది. పెద్ద ఎత్తున అసంతృప్తులను గుర్తించి పార్టీలో చేర్చుకుంటోంది. నియోజకవర్గాల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అదే సమయంలో…. ఇతర పార్టీల నేతలు తమ నేతలకు ఏమైనా ఆఫర్లు ఇస్తే… వెంటనే తమకు తెలిసేలా ఏర్పాట్లు చేసుకుంది. ఇటువంటి సమాచారాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న కాల్ సెంటర్ కు తెలియ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తల నుంచి సమాచారం అందుతుంది.