ఎన్నికలంటే గెలుపు ఓటములే కాదు. ఖర్చు కూడా. ఈసారి ఎన్నికలు అత్యంత ఖరీదుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలవాలంటే కనీసం ఇరవై కోట్లు అవసరం అవుతాయి ఆంధ్రలో. అలాంటిది ఎంపీగా అంటే కనీసం యాభై కోట్లు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎంపీగా పోటీ చేస్తున్నారు. దానికి పెట్టుబడి ఎవరిది? అన్నది క్వశ్చను?
నాగబాబు అంత సౌండ్ పార్టీ కాదు. ఆరెంజ్ సినిమా దెబ్బకి ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా బాగా చితికిపోయారు. ఆఖరికి మెల్లగా నిలదొక్కుకున్నారు. కొడుకు వరుణ్ తేజ్ ఇప్పుడిప్పుడే కాస్త డబ్బులు చేసుకుంటున్నాడు. అంతమాత్రం చేత నాగబాబు ఫ్యామిలీ దగ్గర కోట్లకు కోట్లు వున్నాయని అనుకోవడానికి లేదు.
పోనీ జనేసన పార్టీ పెట్టుబడి పెడుతుందా? అంటే అదీ అనుమానమే. ఎందుకంటే ఇదే సీటు ను గీతా సంస్థ కీలక వ్యక్తి బన్నీవాస్ కు పవన్ కళ్యాణ్ ఆఫర్ చేసారు. కావాలంటే పాలకొల్లు నుంచి అయినా పోటీ చేయమన్నారు. కానీ అంత ఆర్థికస్థోమత తనకు లేదని బన్నీవాస్ తప్పుకున్నారు. దానికి పవన్ ఊరుకున్నారు తప్ప, పార్టీ సాయం చేస్తుందని అనలేదు.
మరి నాగబాబుకు ఏ మేరకు సాయం చేస్తారు? అన్నది అనుమానం. పైగా పవన్ పోటీ చేస్తున్న రెండు చోట్ల, అలాగే జెడి లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్న చోట్ల పెట్టుబడి అవసరం వుంది. వాటితో పాటు నాగబాబుది కూడా అనుకుంటే, జనసేన కేవలం 100 కోట్లు కేవలం ఈ నాలుగు స్థానాలకే కేటాయించాలి. మరి అంత మొత్తం జనసేన దగ్గర వుందా?
మిగిలిన స్థానాలకు పెట్టుబడి సంగతి అలా వుంచితే ఈ నాలుగుస్థానాలకు మాత్రం స్పాన్సరింగ్ తప్పదు? అది ఎలా అన్నది పవన్ కళ్యాణ్ కు మాత్రమే తెలిసిన సీక్రెట్ కావచ్చు.
ఇదిలా వుంటే భీమవరం ఖర్చును ఓ విద్యాసంస్థల అధినేత భరిస్తున్నారని, గెలిచిన తరువాత పవన్ రాజీనామా చేసి, ఆ సీటును ఆయనకు ఇవ్వడానికి ఒప్పందం అని ఓ రూమర్ వినిపిస్తోంది. అది ఎంతవరకు నిజమో అన్నది తరువాత తరువాత తెలుస్తుంది.