వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత హిట్ లిస్ట్‌లో ఉన్న నేతల్లో.. దేవినేని ఉమ ఒకరు. కావాలంటే.. కడప నుంచి మనుషుల్ని తీసుకొచ్చి అయినా ఓడించడానికి జగన్ రెడీగా ఉన్నారని.. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ .. తండ్రి.. వసంత నాగేశ్వరరావు.. హెచ్చరించిన ఆడియో ఆ మధ్య కలకలం రేపింది. దానికి తగ్గట్లుగానే వైసీపీ మైలవరంలో కార్యాచరణ రూపొందిస్తోంది. మరి దేవినేని ఉమను ఓడించడం అంత తేలికనా..?
దేవినేని ఉమను ఓడించాలన్నది జగన్ లక్ష్యం..!
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. మైలవరం నియోజకవర్గంలో రెండు లక్షల 71 వేల మంది ఓటర్లు ఉన్నారు. మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలాలతో పాటు, విజయవాడ రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలను కలుపుకుని ఏర్పడిందే మైలవరం నియోజకవర్గం. గత ఎన్నికల్లో వరుసగా రెండవసారి విజయం సాధించిన మంత్రి దేవినేని ఉమాకి అతి తక్కువ మెజారిటీ వచ్చింది. అప్పట్లో దేవినేని ఉమాకు ప్రత్యర్ధిగా ఉన్న జోగి రమేష్ ప్రస్తుతం నియోజకవర్గం మారారు. ఆయన స్థానంలో వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమాకు తాజా ప్రత్యర్ధిగా మారారు. జగన్ పాదయాత్ర ఈ నియోజకవర్గంలో ఆశించిన రీతిలో జరగగపోవడం, సరైన స్పందన లభించకపోవడంతో అభ్యర్ధిని మార్చాలని ఆనాడే జగన్ నిర్ణయించి ఆర్ధిక బలం ఉన్న వసంత కృష్ణప్రసాద్ ను రంగంలోకి దించారు. ఇరు పక్షాలు ఎన్నికలకు ముందే రాజకీయ వేడిని రగిలించాయి. ఏకంగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి డబ్బులిస్తూ…సీసీ టీవీలో అడ్డంగా బుక్కయిన వైసిపి నేతల వ్యవహారం, గుంటుపల్లి వీఆర్వోకు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు బెదిరింపు వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించాయి.
ఖర్చుకు వెనుకాడకుండా వసంత కృష్ణప్రసాద్ ప్రయత్నం..!
ఎలాగైనా ఈ సారి మంత్రి దేవినేని ఉమా పై విజయం సాధించాలనుకుంటున్న వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్.. ఖర్చుకు వెనుకాడటం లేదు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళకు చీర పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్లకు నగదు బహుమతులు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. నోటిఫికేషన్ రాక ముందే ఆయన ఓ రూ. 40 కోట్లు పంచేసి ఉంటారన్న మైలవరంలో ప్రచారం జరుగుతోంది. కానీ పరిస్థితులు అంత అనుకూలంగా మాత్రం మారడం లేదు. పెడనకు మారిన జోగి రమేష్ .. తన వర్గాన్ని ప్రచారానికి దూరంగా ఉండమని ఆదేశించారు. దాంతో ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారు. క్యాడర్ పెద్దగా సహకరిస్తున్నది కూడా లేదు.
అభివృద్ధి, సంక్షేమం గెలిపిస్తుందని దేవినేని ఉమ నమ్మకం..!
దేవినేని ఉమ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ..రోజుకు రెండు గ్రామాల చొప్పున ఇప్పటికే 25 గ్రామాలలో ప్రచారం పూర్తి చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి తరలి రావడం ఉమాకి ప్రధానంగా కలిసి వచ్చే అంశంగా మారింది. దేవినేని ఉమ నివాసం ఉండే గొల్లపూడి, విజయవాడ రూరల్ మండలంలోని జక్కంపూడి గ్రామాలలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉండటంతో ఇరు పక్షాలు ఇక్కడ దృష్టి కేంద్రీకరించాయి. మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు మండలాలు టిడిపికి అనుకూలంగా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి, గొల్లపూడి, విజయవాడ రూరల్ మండలంలోని జక్కంపూడి లో సాధించే మెజార్టీ కీలకంగా మారబోతోంది.