జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజకీయ పోరాటంపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి పొత్తుల కోసం.. తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఆయన జూనియర్ పార్టనర్‌గా ఉండేందుకు అంగీకరించలేదు. కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని.. ఓ ప్రధాన పోటీదారుగానే బరిలో నిలిచారు. ఈ క్రమంలో.. ఆయన ప్రధానంగా.. ఎవర్ని టార్గెట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. గాజువాకలో నామినేషన్ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసారు. జగన్.. జాతకం ఈడీ, సీబీఐ దగ్గర ఉంటుందన్నారు. ఆయన దోపిడీనే చేస్తారా? మనకు న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. పక్క పార్టీల క్రిమినల్స్ మీద పడితే.. ఎదుర్కోడానికి జనసేనకు మాస్ లీడర్లు కావాలన్నారు. జగన్, చంద్రబాబు మంచి అభ్యర్థుల్ని పెడితే.. తాను కూడా మంచి అభ్యర్థుల్నే నిలబెడతానన్నారు. ఏ ముఖం పెట్టుకుని వైసీపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
ప్రాంతీయ పార్టీ ఏదైనా వరుసగా రెండో సారి ఓడిపోతే ఆ పార్టీ మనుగడ సాగించడం అన్నది అంత తేలిక కాదు. ఈ విషయంలో పవన్ కల్యాణ్‌కు క్లారిటీ ఉంది. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ.. ఎన్నిసీట్లు సాధించిందన్న విషయం చూసుకోకుండా… ప్రభావవంతమైన ఓట్ల శాతం సాధిస్తే.. అదే తన రాజకీయ భవిష్యత్‌కు పునాది అని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో… భిన్న వర్గాల మద్దతును కూడగట్టుకునేందుకు బీఎస్పీతో పొత్తులకు వెళ్లారు. కమ్యూనిస్టులతో కలిసి కూటమి కట్టారు. ఫలితంగా జనసేనకు వచ్చే ఓట్ల శాతంలో… మెరుగుదల కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.. పద్దతిగా.. వచ్చే ఎన్నికల తర్వాత బలమైన శక్తిగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూనే తన రాజకీయ టార్గెట్‌ను కూడా.. పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇంత కాలం.. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై కాస్త సాఫ్ట్‌గా స్పందించేవారు. జగన్ మోహన్ రెడ్డి.. వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు కూడా సంయమనం పాటించారు. కానీ ఐదో ఆవిర్భావ దినోత్సవం నుంచి రూటు మార్చారు. నేరుగా.. పవన్ కల్యాణ్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
టీఆర్ఎస్ సాయంతో.. ఎన్నికల సమరం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తీరును.. సమర్థంగా ప్రజల ముందు ఉంచారు. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఓ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారని.. ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే ఓ సారి ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి బయటపడటం అంత తేలికకాదు. పైగా ఆయన ఇమేజ్ కూడా… కాస్త వయోలెంట్‌గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో… ఆయనకు తానే ప్రత్యామ్నాయం అని చెప్పడానికి పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికలను అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని భావింవచ్చంటున్నారు. మాయావతి మద్దతు తీసుకోవడం ద్వారా.. దళిత ఓట్లను తనవైపు తిప్పుకొని కింగ్ మేకర్‌గా మారాలన్నది పవన్ వ్యూహం. అలాగే లెఫ్ట్ పార్టీలు బలహీనపడినా… వారికి కొంత స్థిరమైన ఓటు బ్యాంక్ ప్రతి నియోజకవర్గంలోనూ ఉంది. వారి ఓటింగ్ కూడా కలసి వస్తుంది. ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అవుతుంది. అందుకే జగన్ తన మొదటి టార్గెట్ జగన్.. రెండో టార్గెట్ చంద్రబాబుగా డిసైడయ్యారు.