జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీపై… సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ నోరు తెరవాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారసభల్లో ప్రసంగించిన చంద్రబాబు అనూహ్యంగా.. వీవీ లక్ష్మినారాయణ ప్రస్తావన తెచ్చారు. జగన్ చేసిన అవినీతి గురించి చెబుతూ… ఆయన బండారాన్ని లక్ష్మినారాయణ బయట పెట్టాలని కోరారు. జగన్ పై ఉన్న 12 కేసుల గురించి లక్ష్మీనారాయణ నోరు తెరవాల్నారు. వాస్తవాలన్నీ 5కోట్ల మంది ప్రజలకు చెప్పాలన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులన్నింటినీ.. వీవీ లక్ష్మినారాయణనే దర్యాప్తు చేశారు. గాలి జనార్ధన్ రెడ్డిని కూడా ఆయనే అరెస్ట్ చేశారు. ఆ సమయంలో… నేరుగా ఓ న్యాయమూర్తికి బెయిల్ కోసం గాలి గ్యాంగ్ లంచాలివ్వబోతూంటే పట్టుకున్నారు కూడా. వీవీ లక్ష్మినారాయణ సీబీఐలో డిప్యూటేషన్ ముగియడంతో.. మళ్లీ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఆ కేసులు ఎక్కడివక్కడ ఉండిపోయాయి. ఆ తర్వాత లక్ష్మినారాయణ వీఆర్ఎస్ తీసుకుని… ఇప్పుడు జనసేనలో చేరి.. విశాఖ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే.. సీబీఐ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడూ.. తన విధి నిర్వహణ గురించి మాట్లాడలేదు. ఏ సందర్భంలో అయినా మీడియా అడిగితే.. నో కామెంట్ చెప్పేవారు. ఇప్పుడు కూడా ఆయన తాను ఐపీఎస్‌గా చేసిన రోజుల్లో దర్యాప్తు చేసిన కేసుల గురించి మాట్లాడే అవకాశం దాదాపుగా లేనట్లే. పైగా అవి విచారణలో ఉన్న కేసులు. వీవీ లక్ష్మినారాయణ అసలు మాట్లాడకపోవచ్చన్న అంచనాలున్నాయి.
అయితే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి.. వీవీ లక్ష్మినారాయణ తన విధానాన్ని మార్చుకుంటారేమోనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. వైసీపీ నేతలు.. వీవీ లక్ష్మినారాయమపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుతో కుమ్మక్కయి జగన్ పై అక్రమ కేసులు పెట్టారని వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. వీటిని గట్టిగా తిప్పికొట్టడానికి ఆయన ఏమైనా మాట్లాడతారా అన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది.