వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో విచారణ అధికారులను ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారంటూ.. వివేకా కుమార్తె సునీత.. అమరావతిలో ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని.. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ద్వివేదిని సునీత కోరారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేస్తానన్నారు. బుధవారం పులివెందులలో ప్రెస్ మీట్ పెట్టి.. సిట్ విచారణపై నమ్మకం వ్యక్తం చేశారు. కొంత మంది కామెంట్లు చేస్తున్నారని బాధపడ్డారు. అయితే.. వివేకా కేసులో మొదటగా గుండెపోటు అని నమ్మించిన వైసీపీ నేతలు… హత్య అని అందరికీ తెలిసిపోయిన తర్వాత… మొట్ట మొదటగా చంద్రబాబు,లోకేష్, ఆదినారాయణరెడ్డి పనేనంటూ ఆరోపణలు ప్రారంభించారు.
ఆ తర్వాత టీడీపీ నేతలు కూడా.. కౌంటర్ గా… ఇంటి దొంగల పనేనని విమర్శలు చేయడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలోనూ.. చంద్రబాబే తన బాబాయ్‌ని చంపించారని.. నేరుగా ఆరోపణలు చేస్తూంటారు. దానిపై సునీత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఫిర్యాదు చేశారు. వివేకానందరెడ్డి హత్య ఘటనపై.. సానుభూతి కోసం వైసీపీ నేతలు.. చిల్లర వేషాలు వేస్తున్నారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలోనే… సునీతపై ఒత్తిడి తెచ్చి మీడియాకు ముందు తెచ్చారని.. ఫిర్యాదులతో..రాజకీయ ప్రయోజనం చూసుకుంటున్నారన్న విమర్శలు టీడీపీ నేతలు చేస్తున్నారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన నిందితులందర్నీ గుర్తించారు. కొంత మందిని అరెస్ట్ చేశారు. సాక్ష్యాలను కూడా దాదాపుగా సేకరించారు. దొరికిన సాక్ష్యాల ఆధారంగా.. మరోసారి వైఎస్ కుటుంబీకులను పిలిచి ప్రశ్నించారు. నాలుగైదు రోజుల్లో దీనిపై విచారణ ముగించి.. అసలు కుట్ర మొత్తాన్ని పోలీసులు బయట పెట్టే అవకాశం కనిపిస్తోంది. అందుకే.. వైసీపీ నేతలు కూడా అప్రమత్తమయ్యారు. అవినాష్ రెడ్డికి ఈ హత్య కేసును చుట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ.. ఆ పార్టీకి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి.. మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు.