భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ క్రమంలో విశాఖపట్నం ఎంపీగా పురందేశ్వరి పేరును ఖరారు చేశారు. గత ఎన్నికల్లో వైయస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మపై భారీ మెజారిటీతో గెలిచిన కంభంపాటి హరిబాబుకి ఈసారి టిక్కెట్ దక్కలేదు! వాస్తవానికి, ఆయనే పోటీపై పెద్దగా ఆసక్తి చూపలేదని అంటున్నారు. ఓదశలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైజాగ్ నుంచి పోటీ చెయ్యొచ్చనే అభిప్రాయలూ వ్యక్తమయ్యాయి. అయితే, ఆయనకి నర్సరావుపేట టిక్కెట్ ను పార్టీ కన్ఫర్మ్ చేసింది. విశాఖ ఎంపీ స్థానం విషయానికొస్తే… ఇప్పటికే జనసేన నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ, వైకాపా నుంచి ఎమ్.వి.వి. సత్యనారాయణ, టీడీపీ నుంచి భరత్, ఇప్పుడు భాజపా నుంచి పురందేశ్వరి రాకతో పోటీ రసవత్తరంగా కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో భాజపా గెలుచుకున్న ఈ సీటును, మళ్లీ నిలబెట్టుకునే అవకాశాలు పక్కాగా ఉన్నాయా అంటే… కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే, గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ హవా తీవ్రంగా ఉంది. విశాఖలో నేవీ, ఆర్మీ, ఇతర కేంద్ర సంస్థలకు చెందిన ఉద్యోగుల్లో ఉత్తరాదివారు ఎక్కుమంది ఉన్నారు. వారి ఓట్లన్నీ మోడీకి అనుకూలంగా పడటం, స్థానికంగా భాజపాకి టీడీపీతో పొత్తు ఉండటం, విశాఖ ఎంపీ పరిధిలోకి ఎమ్మెల్యే నియోజక వర్గాల్లో టీడీపీకి భారీ మెజారిటీతోపాటు, ఎంపీ ఓట్లు భాజపాకి పడటం… ఇవన్నీ ప్లస్ అయ్యాయి. ఫలితంగా వైయస్ విజయమ్మపై భారీ ఓట్ల తేడాతో హరిబాబు గెలిచారు.
ఈ ఎన్నికల్లో భాజపాకి ఆ పరిస్థితి కనిపించడం లేదు. చివరికి, విశాఖ రైల్వేజోన్ ప్రకటించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. జోన్ తామే ఇచ్చామని ప్రధానమంత్రి స్వయంగా వచ్చి విశాఖలో ప్రకటన చేసినా కూడా… దాని వల్ల విశాఖ ప్రాంతానికి కొత్తగా వచ్చే లాభమేదీ లేదనేది ప్రజలూ గ్రహించారు. ఆంధ్రాకి మోడీ సర్కారు మోసం చేసిందనే బలమైన అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఈసారి భాజపాపై తీవ్ర వ్యతిరేకత ఉంది. మరోసారి మోడీని ప్రధానిగా అత్యంత బలంగా కోరుకుంటున్న పరిస్థితీ దేశవ్యాప్తంగా లేదు. విశాఖలో ఉంటున్న ఉత్తరాది ఉద్యోగుల్లో కూడా ఆ మేరకు కొంత చీలిక కచ్చితంగా ఉంటుంది. అన్నిటికీ మించి, సిట్టింగ్ ఎంపీగా ఉన్న హరిబాబు గత కొన్నాళ్లుగా విశాఖలో పార్టీ తరఫున చెప్పుకోదగ్గ క్రియాశీలంగా లేరు. ఈ సవాళ్లను పురందేశ్వరి ఎలా సానుకూలంగా మార్చుకుంటారో చూడాలి.