తెలంగాణ రాజకీయాల్లో కాకా వెంకటస్వామిని ఎవరూ మర్చిపోలేరు. ఆయన కుమారులు ఇద్దరూ రాజకీయాల్లో ఎవరికీ కాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో పెద్ద కుమారుడు వినోద్ చెన్నూరు నుంచి బీఎస్పీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ టిక్కెట్ నిరాకరించింది. ఇప్పుడు తమ్ముడు వివేక్‌కు కూడా కేసీఆర్ హ్యాండిచ్చారు. అప్పటికప్పుడు టీఆర్ఎస్ కండువా కప్పుకున్న… కాంగ్రెస్ నేత వెంకటేశ్ ను పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించారు. గత ఎన్నికల్లో ఈయన చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేశారు.
వివేక్ పై తీవ్ర వ్యతిరేకత తో ఉన్న లోక సభ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వ్యూహాత్మకంగా వెంకటేష్ ను తెరపైకి తెచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు ఎమ్మెల్యే సుమన్ చక్రం తిప్పారు. వీరికి బెల్లంపల్లి, రామగుండం ఎమ్మెల్యే లు చందర్, చిన్నయ్య లు తోడయ్యారు. పెద్దపల్లి, మంచిర్యాల ఎమ్మెల్యే లు, మంథని మాజీ ఎమ్మెల్యే సైతం అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అని చెప్పడంతో వివేక్ కు ప్రత్యామ్నాయం వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఇపుడున్న పరిస్థితి లో పెద్దపల్లి లో ఎవరిని నిలబెట్టినా సులువుగా విజయం సాధిస్తామని అంచనాకు వచ్చిన అధిష్టానం వెంకటేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిర్యాల జిల్లాకు చెందిన బోర్లకుంట వెంకటేష్ ఎస్సీ ల్లోని నేతకానీ తెగకు చెందిన వారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ముందు గ్రూప్ వన్ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ లో చేరిన వెంటనే చెన్నూరు టికెట్ దక్కించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సుమన్ చేతిలో ఓడిపోయారు.
వెంకటస్వామి వారసత్వం, వినోద్ కు కూడా టిక్కెట్ ఇవ్వకపోవడం వంటి పరిణామాలతో వివేక్‌ను పక్కన పెట్టరని చెబుతున్నారు. కేసీఆర్ .. వివేక్ వైపే ఉన్నారని.. చిన్న సూచన వచ్చినా.. ఎమ్మెల్యేలు.. ఒక్క మాట కూడా వివేక్‌కు వ్యతిరేకంగా మాట్లాడేవారు కాదు. కేసీఆర్ తన వైపే ఉన్నారని.. వివేక్ ధీమాగా ఉన్నారు. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. వివేక్.. ఉద్యమ సమయంలో.. తన తండ్రికి ఉన్నత స్థానాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన సమయంలో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ ఓడిపోవడంతో మళ్లీ టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఆయన కోసం బీజేపీ నేత రామ్ మాధవ్ గాలం వేస్తున్నారు. వివేక్ ఆ గాలానికి చిక్కితే.. ఇంత కంటే.. రాజకీయ తప్పిదం ఇంకేమీ ఉండదేమోనని.. ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.