చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధిని చంద్రబాబు మార్చేశారు. తేలం పూర్ణంను అభ్యర్ధిగా ఖరారు చేసినప్పటికి చివరిక్షణంలో ఆ నియోజకవర్గం ఇన్ చార్జి లలితకుమారికి టిక్కెట్ ఖరారు చేశారు. ఆమె ఇప్పటికి ఆ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు లలితకుమారితో పాటు పలువురు పోటీపడ్డారు. తవణంపల్లె మండలంకు చెందిన తేలం పూర్ణం అనే కొత్త వ్యక్తికి టికెట్ ఖరారు చేసింది టీడీపీ హైకమాండ్. దీంతో లలిత కుమారి కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించుకుంటున్నారు.
ఈ లోపే.. టిక్కెట్ పొందిన తేలం పూర్ణం తీసుకోవడానికి రాలేదు. పార్టీ నేతలకు సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయనకు బెదిరింపులు వచ్చాయని ఆజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. ప్రత్యర్ధి పార్టీల నుంచి ఆయనపై వత్తిడి రావడం, పోటీచేస్తే మీ అంతు చూస్తాం అనే బెదరింపుల కారణంగానే ఆయన వెనక్కి తగ్గారని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. దీంతో ఆయన పోటీ చేయరనే భావనకు.. టీడీపీ వర్గాలు వచ్చాయి. ఈ పరిణామాలతో చంద్రబాబు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. కొన్ని చానల్స్‌లో టీడీపీ అభ్యర్థి అదృశ్యం అని ప్రచారం జరగడంతో.. ఏం జరిగిందని స్క్రీనింగ్ కమిటీని ఆరా తీశారు. అభ్యర్థి మార్పుపై కసరత్తు చేపట్టారు.లలితకుమారి వర్గంను అమరావతికి రమ్మంటూ పిలువచ్చింది. అమరావతి చేరుకున్న ఆమెకు చంద్రబాబు టికెట్ ఖరారు చేసి.. బీఫాం ఇచ్చి పంపించారు.
నిజానికి ఈ తేలం పూర్ణం… వైసీపీ కార్యకర్త. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నంచి విఫలం అయ్యారు. ఈసారి కూడా ఆయన అదే పార్టీనుంచి టికెట్ కోసం ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇక చివర క్షణంలో టీడీపీలో ఒక రాయి అలా విసిరారు. టీడీపీలో టిక్కెట్లు ఖరారు చేసేవారు ఏం చూశారో కానీ.. టిక్కెట్ ఇచ్చేశారు. కానీ బీఫాం తీసుకోవడానికి ఆలస్యం చేసిన కారణంగా.. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం.. దీన్ని అనుకూలంగా మల్చుకున్న వైసీపీ నేతలు… చేసిన ప్రచారంతో.. ఆయన టిక్కెట్ చిరిగిపోయింది.