తెరాస ఎంపీ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే! అయితే, అసెంబ్లీ ఎన్నికలు మాదిరిగా ఈసారి సిట్టింగులందరికీ టిక్కెట్లు ఇవ్వలేదు. ప్రముఖులను కూడా పక్కనపెట్టేయడం విశేషం. జితేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ లాంటి సీనియర్లను… ఢిల్లీలో కాస్త బలంగా గొంతు వినిపించే సామర్థ్యం ఉన్నవారికి ఈసారి ప్రాధాన్యత లేకుండా చేశారు కేసీఆర్! ఇదంతా పనితీరు ఆధారంగా తీసుకున్న నిర్ణయమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానికంగా కొంత వ్యతిరేకత, అభ్యర్థుల తీరును దృష్టిలో పెట్టుకునే ఎంపీ టిక్కెట్ల కేటాయింపు చేశారని అంటున్నారు. నిజానికి, ఇలాంటి ప్రముఖులను పక్కనపెట్టినప్పుడు… పార్టీలో కొంత అసంతృప్తి వాతావరణం కనిపించాలి. కానీ ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి. స్థానికంగా కేసీఆర్ మరింత బలంగా ఉన్నారు కాబట్టి… అవి వ్యక్తం కావడం లేదని చెప్పుకోవచ్చు. అయితే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక వెనక కేసీఆర్ వ్యూహం వేరే ఏదైనా అంతర్లీనంగా ఉందా అంటే… ఉందనే అనిపిస్తోంది.
లోక్ సభ ఎన్నికల్లో కూడా తెరాస పెద్ద సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుస్తుందనేది దాదాపు ఖాయం. ఎందుకంటే, గట్టి పోటీని ఇచ్చేంత చొరవ ప్రతిపక్షాలు చూపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయామనీ, ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో వ్యయ ప్రయాసపడినా ప్రయోజనం ఏముంటుందనే ఒకరకమైన నిర్లిప్తత కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కేసీఆర్ కి కలిసొచ్చే పరిణామాలు. దీంతో ఎన్నికల తరువాత… జాతీయ స్థాయిలో తెరాస కీలకం కాబోతుందనే నమ్మకం ఆయనకి బలంగా ఉంది. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే… అక్కడ ఎవరు ఫోకస్ అవ్వాలి..? కేసీఆర్.. లేదా ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కదా!
ఇంకా చెప్పాలంటే… సీఎం కుమార్తె కవితకు ఈసారి కేంద్రమంత్రి పదవి గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు. ఈ లక్ష్యం ప్రకారం చూసుకుంటే… పొంగులేటి, జితేందర్ లాంటి సీనియర్లు ఆమెకి పోటీ అయ్యే అవకాశం ఉంటుంది. వీరు కూడా ఎంపీలు అయితే… ఢిల్లీలో కవిత కంటే వీరే ప్రాధాన్యత ఉంటుంది. ఆ స్థాయి వాయిస్ కూడా వీళ్లకి ఉంది. పైగా, ఢిల్లీలో ఇతర పార్టీలతో లాబీయింగ్ చేయగలిగే సమర్థతా ఈ నాయకులకు ఉంది. సో… ఇలాంటి వారందరినీ ఇప్పుడే కట్ చేస్తే, ఎన్నికల తరువాత కేంద్రం నుంచి తాను ఆశిస్తున్న ప్రయోజనాలు దక్కించుకునేందుకు పోటీ పడేవారు ఉండనట్టే! లోక్ సభ ఎన్నికల్లో సీనియర్లను పక్కనపెట్టడం వెనక కేసీఆర్ వ్యూహం ఇదే అయి ఉంటుందనే విశ్లేషణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.