ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎంపీ టికెట్ కానీ రావాలంటే కోట్లాది రూపాయల ఆస్తి ఉండాలి, లేదంటే పలుకుబడి ఉన్న కుటుంబాల నుండి వచ్చి ఉండాలి, లేదంటే తరతరాలుగా రాజకీయాలు చేస్తున్న కుటుంబం నుండి వచ్చి ఉండాలి అన్న అభిప్రాయాలను తిరగరాస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కండక్టర్ కొడుకు కి, ఒక రైతు కూలీ కొడుకుకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. సామాన్యులు గా ఉంటూనే వీరు సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొన్న కారణంగానే పవన్ కళ్యాణ్ వీరికి టికెట్లు ఇచ్చారని తెలుస్తోంది. వారిలో ఒకరైన గౌరీ శంకర్ కథ ఇది:
తండ్రి రైతు కూలీ, తల్లి కూరగాయలు అమ్ముకుంటుంది. పేదరికం కారణంగా ఏడవ తరగతి తర్వాత స్కూలుకు వెళ్లడం ఆపేసి కూలి పనులకు వెళ్లాల్సి వచ్చింది. అయితే స్కూలుకు వెళ్లడం మానేసినా చదువుకోవడం ఆపలేదు. పదవ తరగతి పరీక్ష నేరుగా రాసి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో చేరినప్పటికీ, డిగ్రీ సెకండ్ ఇయర్ లో మళ్ళీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేయాల్సి వచ్చింది. చదువు మధ్యలో మానేసి హైదరాబాద్ వెళ్లి ఒక ఆటోమొబైల్ కంపెనీ లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ, దూర విద్య ద్వారా డిగ్రీ పాస్ అయ్యాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని తన సొంత ఊరైన కురుప్పాం నియోజకవర్గంలోని దలై పేట కు తిరిగి వచ్చాడు.
సామాజిక సేవ ద్వారా పవన్ కళ్యాణ్ ను ఆకర్షించిన గౌరీ శంకర్:
ఆర్థిక ఇబ్బందులతో పాటు రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం వల్ల కూడా తన గ్రామంలోని అనేక మంది బాలికలు, అబ్బాయిలు విద్యను కోల్పోతున్నారని, గ్రామానికి ప్రాథమిక మౌలిక సౌకర్యాలు మరియు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు లేవని, దీనిని పరిష్కరించడానికి చేతనైనంతలో ఏదైనా ఒకటి చేయాలని భావించి యువత తో ‘ప్రాణ మిత్రుల సమూహాన్ని’ గౌరీ శంకర్ ప్రారంభించారు. మొదట్లో ఆరోగ్యం గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి, పిల్లలో విద్య అవసరం గురించి అవగాహన పెంచడానికి వీరు ప్రయత్నించారు.
జనసేన ఎన్ఆర్ఐ చేత ప్రారంభించబడిన ‘అక్షరమాల’ కార్యక్రమాలను తన ప్రాంతంలో విస్తరించిన గౌరీ శంకర్ , 80 మంది బాలబాలికలను అక్షరమాల కార్యక్రమంలో చేర్పించి గత కొద్దేళ్లుగా వారికి ఉచిత విద్యను అందించడం కోసం కృషి చేశారు. ఇక శ్రీకాకుళం లో జనసేన ప్రజా పోరాట యాత్ర సందర్భంగా స్వచ్ఛందంగా జనసేన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత పార్వతీపురం, భోగాపురం ప్రాంతాలలో జనసేన కార్యక్రమాలు పర్యవేక్షించే బాధ్యత ఆయనకు అప్పగించబడింది. దాని సమర్థవంతంగా నిర్వహించారు. ఆ సందర్భం కళ్యాణ్ ని ఆకర్షించిన గౌరీ శంకర్ ని పవన్ కళ్యాణ్ భేటీ కి ఆహ్వానించి 38 నిమిషాల పాటు తనతో చర్చించారు. తను చేసిన సేవా కార్యక్రమాలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ తనని అభినందించారు. అంతేకాకుండా జనసేన తరపున నిర్వహిస్తున్న లీడర్ షిప్ ప్రోగ్రాం లోకి తనను తీసుకున్నారు. ప్రత్యేకించి, వైద్య సదుపాయాలను తీసుకెళ్లడానికి ఇబ్బందికరంగా ఉన్న గిరిజన ప్రాంతాలకి వైద్య సహాయం అందించడానికి ‘డ్రోన్ ఆంబులెన్స్’ను సూచించినందుకు పవన్ కళ్యాణ్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
జనసేన తరపున ఎమ్మెల్యే టికెట్:
అయితే తనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఊహించలేదని అంటున్నాడు గౌరీ శంకర్. పార్వతిపురం నియోజకవర్గానికి జనసేన టికెట్ కోసం ఎంతోమంది పలుకుబడి కలిగిన వ్యక్తులు, ధన బలం అంగ బలం కలిగిన వ్యక్తులు పోటీపడినా, వారిని కాదని తనకు టికెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు శంకర్. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తానని, ఇన్నేళ్లుగా మౌలిక వసతులు సరిగా లేని తన నియోజకవర్గంలో రోడ్డు కనెక్టివిటీ తదితర మౌలిక వసతులు మెరుగుపరచడం కోసం, ఈ ప్రాంతంలోని విద్య , వైద్య వసతులు మెరుగుపరచడం కోసం, గిరిజన ప్రాంతాలకు సైతం వైద్య వసతులు అందించడానికి తాను కృషి చేస్తానని అన్నారు గౌరీ శంకర్.
అయితే నిరుపేద రైతు కూలీ కుటుంబం నుండి వచ్చినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా రెండు సార్లు చదువు మానేయాల్సి వచ్చినా పనులకు వెళుతూ సొంతంగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ, తమ ప్రాంతానికి సామాజిక సేవ చేస్తూ పవన్ కళ్యాణ్ దృష్టిని ఆకర్షించి ఇప్పుడు ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న గౌరీ శంకర్ విజయం సాధిస్తే, కచ్చితంగా నవతరం రాజకీయాలు రాష్ట్రంలో మొదలయ్యే అవకాశం ఉంది. మరి తమ ప్రాంతానికి సామాజిక సేవ చేసిన సామాన్యుల ని ఎన్నుకోవడమా లేక షరామామూలుగా ఓట్ల సమయంలో మాత్రమే కనిపించే నాయకులను ఎన్నుకొని, మళ్లీ రాబోయే ఐదేళ్లపాటు టీవీ కెమెరాల ముందు ఆ నాయకులని తిట్టడమా అన్నది ప్రజల చేతుల్లోనే ఉంది.