తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆపరేట్ చేస్తున్నారన్న చర్చను రాజకీయ పార్టీలు ప్రముఖం చేస్తున్నాయి. ఇదే అంశంపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతీ సభలో చెబుతున్నారు. ఏపీలో ఫ్యాన్ తిరగాలంటే, హైదరాబాద్ లో కేసీఆర్ స్విచ్ ఆన్ చెయ్యాలి, ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ కరెంట్ ఇవ్వాలంటూ ప్రతీ సభలోనూ ప్రముఖంగా ప్రస్థావిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ చర్చకు మరింత ఊతమిచ్చేలా మాట్లాడారు. కేసీఆర్ అనుమతి ఇస్తే తప్ప వైకాపా నాయకుల్ని నిలబెట్టుకునే పరిస్థితి లేదని పవన్ నూజివీడులో విమర్శించారు.
వైకాపా ఎమ్మెల్యే గెలిస్తే పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఎందుకంటే, ఆంధ్రాకి వచ్చే పరిశ్రమల్లో తమకు వాటా కావాలంటూ జగన్, విజయసాయి రెడ్డిలు లంచాలు అడుగుతారన్నారు. అందుకే, వైకాపా గెలిస్తే పరిశ్రమలు రావన్నారు. కాబట్టి, పని చెయ్యనివారిని ఎందుకు గెలిపించడమన్నారు. అందుకే, వైకాపాని పక్కనపెట్టెయ్యాలనీ, ఎందుకంటే వారు పులివెందుల నుంచి ఆపరేట్ చేస్తారన్నారు. జగన్ కి ఆంధ్రా అంటే నిజంగా ప్రేమ ఉంటే… అమరావతి వచ్చి టిక్కెట్లు ప్రకటించాలి కదా, కానీ ఆయన హైదరాబాద్ లో కూర్చుని పంచుతారేంటని ప్రశ్నించారు? తాను అందరికీ అందుబాటులో ఉంటాననీ… కేసీఆర్ కనుసన్నలలో నడిచే జగన్మోహన్ రెడ్డిని కాదన్నారు.
చంద్రబాబు నాయుడు మీద కోపంతో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, వచ్చి నేరుగా పోటీ చేయాలని తెలంగాణ అధికార పార్టీ నాయకులను ఉద్దేశించి పవన్ అన్నారు. వైకాపా అభ్యర్థి గెలిస్తే… అక్కడ తెరాస అభ్యర్థి గెలిచినట్టేనని పవన్ చెప్పారు. వైకాపా అభ్యర్థులు గెలిస్తే… ఆంధ్రులు ద్రోహులు అని తిట్టిన కేసీఆర్ గెలిచినట్టే అన్నారు. వైకాపా అభ్యర్థి గెలిస్తే… ఆంధ్రుల ఆత్మగౌరవం పోయినట్టేనని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆంధ్రా నాయకులు తెలంగాణ రాకూడదటా, కానీ తెలంగాణ నాయకులు వైకాపా ద్వారా ఆంధ్రాలోకి రావొచ్చా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. విద్యార్థి విభాగం తెలంగాణ నుంచి జగన్ ను తరిమేశారనీ, అలాంటి తెరాస నాయకులు ఇప్పుడు జగన్ కి మద్దతు పలుకుతానంటే ఎలా అని ప్రశ్నించారు. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఏమీ చెయ్యలేని జగన్, ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారంటూ పవన్ విమర్శించారు. ఆంధ్రాలో కేసీఆర్ నీడలోనే వైకాపా పనిచేస్తోందనే అభిప్రాయాన్ని పవన్ మరింత బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. మరి, ఈ విమర్శలకు వైకాపా నుంచి వచ్చే సమాధానం ఏముంటుందో చూడాలి.