ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక లోక్‌సభ స్థానం ఉన్నాయి. జిల్లాలోని అన్ని చోట్ల అభ్యర్ధుల ఎంపికలో సామాజిక వర్గాల సమతూకం పాటించటంలో టీడీపీ సఫలం అయ్యింది. విపక్ష వైసీపీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టి..అయినవాళ్లనే దూరం చేసుకుంది. ఒంగోలు పార్లమెంటు స్థానానికి టిడిపి తరపున శిద్ధా రాఘవరావు, వైసిపి తరపున మాగుంట శ్రీనివాసుల రెడ్డి మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. అయితే ఇదే స్థానం నుంచి గత ఎన్నికల్లో మాగుంటపై గెలుపొందిన జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని ఈసారి పక్కన పెట్టడం పెద్ద మైనస్ అయ్యింది. తనకు టికెట్ ఇవ్వనందుకు సుబ్బారెడ్డి అలకబూనారు. జగన్ ఎంతగా సర్ది చెబుతున్నా ఆయన మెట్టు దిగడం లేదు సరికదా.. ఒంగోలులో జగన్ ప్రచార సభకు కూడా సుబ్బారెడ్డి హాజరుకాలేదు. సుబ్బారెడ్డి వర్గం .. ఇతరుల సంగతేమో కానీ.. బాలినేని, మాగుంటలకు మాత్రం సహకరించే పరిస్థితి లేదు.
చీరాలలో పట్టు బిగిస్తున్న కరణం..!
ఒంగోలు అసెంబ్లీ నియోజక వర్గంలో పాతకాపులే బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్, వైపీపీ అభ్యర్ది బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పోటీ గట్టిగానే ఉంది. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. జనసేన అభ్యర్థి భారీగా ఓట్లు చీల్చుకోనున్నారు. చీరాల నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోషన్ టీడీపీని వీడి వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా రంగం లోకి దిగారు. రణం బలరాంను టీడీపీ అభ్యర్దిగా బరిలో నిలిపారు. ఇప్పటికే ఆమంచి వ్యతిరేకులు చీరాల రాజకీయాలకు సుపరిచితులైన కరణం బలరాంకు చేరువవుతున్నారు. మరోవైపు ఆమంచి అభిమానులు కూడా ఆయన గెలుపే లక్ష్యంగా తమ మధ్య ఉన్న విభేదాలను ప్రక్కన పెట్టి ముందుకు సాగటంతో ఇరుపార్టీ మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా మారింది.. పర్చూరు నియోజకవర్గం కూడా రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసిపి అభ్యర్థిగా బరిలోకి దిగారు. కుమారుడు హితేష్ పోటీలో ఉంటారని భావించినా.. కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా దగ్గుబాటే నిలబడాల్సి వచ్చింది. ఇక దగ్గుబాటిపై టిడిపి నుంచి సిట్టింగ్ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పోటీలు ఉన్నారు. అద్దంకిలో టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బరిలో ఉండగా వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకూ టీడీపీలో రెండు వర్గాలుగా ఉన్న గొట్టిపాటి, కరణం వర్గీయులు ఏకం కావటంతో టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది.
జనసేన ప్రభావం ఎవరిపై ఉంటుంది..?
కొండేపి నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామి పోటీలో ఉండగా వైసీపీ నుంచి డాక్టర్ వెంకయ్య బరిలో ఉన్నారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఆయన పోదరుడు దామచర్ల సత్యకూడా స్వామికి మద్దతుగా తమ శక్తిని కూడగట్టడం టిడిపికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. వైసీపీకి ఆ పార్టీలో నెలకొన్న అసంతృప్తులు నష్టం కలిగించే విధంగా ఉంది. దర్శి నియోజకవర్గంలో టీడీపీ నుంచి కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, వైసీపీ నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ బరిలో ఉన్నారు. నియోజకవర్గ రాజకీయాలను చూస్తే కాపు, కమ్మ సామాజికవర్గాల మధ్య సఖ్యత అధికంగా ఉంటుంది. రెడ్డి, కాపు సామాజిక మధ్య విబేధాలు, గ్రామాల్లో ఘర్షణ వాతావరణం కూడా ఉండేవి. పైగా గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే మంత్రి శిద్దా గెలుపొందారు. దీంతో ఎటు చూసినా దర్శిలో వైసిపి ఓటు బ్యాంకుకు గండి పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక వైవీ సుబ్బారెడ్డి అలక బూనటం బూచేపల్లి కుటుంబ సభ్యులు రంగంలో లేకపోవడం ఆపార్టీకి కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కనిగిరి నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని రంగంలోకి తేవటంతో అక్కడి పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు, సన్నిహితుడు అయిన డాక్టర్ ఉగ్రకు అటు టీడీపీ శ్రేణుల నుంచే కాక తటస్థవాదులు, వైసీపీలోని కిందిస్థాయి నేతల నుంచి కూడా మద్దతు అభిస్తోంది. వైసీపీ తరపున గత ఎన్నికల్లో పోటీచేసిన బుర్రా మధుసూదనే రంగంలో ఉన్నారు. యాదవ సామాజిక వర్గంలో పట్టు పెంచుకున్న ఆయనకు రెడ్డి సామాజిక వర్గంలోని నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడలేదు. ఈ నేపధ్యంలో ఉగ్ర రంగంలోకి రావటంతో క్షేత్రస్థాయిలో ఆయనకు మద్దతుగా వలసలు పెరుగుతున్నాయి.
పశ్చిమ ప్రకాశంలో హోరా హోరీ..!
గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీపడిన ముత్తుమల ఆశోక్‌రెడ్డి, అన్నా రాంబాబులు తిరిగి ప్రత్యర్ధులుగా బరిలో నిలిచారు. అయితే గత ఎన్నికల్లో పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రస్తుతం టీడీపీ అభ్యర్ధిగా నిలవగా, అపుడు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన అన్నా రాంబాబు వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి వచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు అలకబూని పార్టీ ప్రచారానికి దూరమయ్యారు. మాజీ ఎమ్మెల్యే సాయికల్పనా రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవడం టీడీపీకి ఆదనపు బలమైంది. మార్కాపురం నియోజకవర్గంలో తిరిగి టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బరిలోకి వచ్చారు. పార్లమెంటు అభ్యర్ధిగా శిద్దా రాఘవరావు ఉండడంతో.. నియోజకవర్గంలో తగిన సంఖ్యలో ఆర్యవైశ్య ఓటర్లు ఉండటంతో టీడీపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని తప్పించడంతో ఆయన వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన అజితారావునే తిరిగి టీడీపీ రంగంలోకి దింపింది. 2009లో ఇక్కడ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదిమూలపు సురేష్ గత ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే డేవిడ్‌రాజు పార్టీ మారటంతో రెండున్నరేళ్ల నుంచి ఆయన తనను గెలిపించిన సంతనూతలపాడును వదిలేసి ఎర్రగొండపాలెంలో తిష్ట వేశారు. సంతనూతలపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ బరిలో ఉండగా వైసీపీ నుంసి వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు పోటీలో ఉన్నారు.. కందుకూరు నియోజక వర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోతుల రామారావు, వైసీపీ అభ్యర్థిగా మాజీమంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరూ రాజకీయ ఉద్ధండులు కావటంతో నియోజకవర్గంలో కందుకూరు రాజకీయం కాక రేపుతోంది.