ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదంటూ.. విద్యార్థులను తీసుకుని రోడ్డెక్కిన మోహన్ బాబు వ్యవహారం అంతకంతకూ పెద్దదవుతోంది. ఐదేళ్ల కాలంలో… రూ. 90 కోట్ల వరకూ ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకున్నారని.. అధికారిక పత్రాలను ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు బయటపెట్టిన తర్వాత.. అసలు విషయం పక్కకు పెట్టి.. మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ… ఎదురు దాడి చేస్తోంది. ఇప్పుడు.. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడటం లేదు. రెచ్చగొడితే.. మీ బండారం బయట పెడతానంటూ.. మోహన్ బాబు.. చంద్రబాబుకు కొత్తగా హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు.. మోహన్ బాబు విద్యా సంస్థలకు సంబంధించిన మొత్తం విషయాలను బయట పెట్టారు. దానికి శనివారం మంచు మనోజ్ ఓ లేఖ రాశారు. అందులో కుటుంబరావుపై విమర్శలు చేశారు కానీ.. అసలు విషయం చెప్పలేదు. ఈ రోజు మోహన్ బాబు కూడా.. అలాగే స్పందించారు. అయితే.. తనది చంద్రబాబు స్థాయి అనుకున్నారేమోకానీ..నేరుగా చంద్రబాబునే చర్చకు రావాలని సవాల్ చేశారు.
“తనని రెచ్చగొడితే అన్నయ్య.. దివంగత ఎన్టీఆర్కు చేసిన మోసాలు, జరిగిన ఘోరాలను బయటపెడ్తానని” సినిమా స్టైల్లో చెప్పుకొచ్చారు. ఇరవై ఐదు శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్య అంటూ అందరికీ ఫీజు రీఎంబర్స్ వసూలు చేయడం, విదేశాల్లో విరాళాలు వసూలు చేయడం వంటి వాటిపై… ఎన్నారైలు ప్రశ్నించడంతో… మోహన్ బాబు.. అన్నింటికీ లెక్కలున్నాయని… చంద్రబాబు వసూలు చేసిన దానికి లెక్కలున్నాయా.. అంటూ ఎదురు దాడి చేశారు. పేదలకు ఉచిత విద్య పేరుతో.. మోహన్ బాబు చేసిన వసూళ్ల గురించి ఎన్నారైలు ప్రశ్నించారు. చంద్రబాబు కాదు. అయినప్పటికీ… మోహన్ బాబు.. చంద్రబాబుపై ఎదురుదాడి చేసి.. బయటపడే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు.. కనిపిస్తోంది.
చివరికి.. చర్చకు రమ్మని కుటుంబరావు సవాల్ చేశారు. విద్యా సంస్థలపై విచారణకు సిద్ధమా అని ప్రకటించారు. దీనిపై…మోహన్ బాబు ఆందోళనకు గురయినట్లు ఉన్నారు. “ఇక వద్దు మొదలుపెడితే చాలా దూరం పోతుంది. నాకు, నా కుటుంబానికి, నా విద్యాసంస్థలకు ఏమి జరిగినా దానికి అతడే కారణం” అని కంక్లూజన్ ఇచ్చారు. చంద్రబాబుపై అన్ని రకాల విమర్శలు చేశారు. రూపాయి కూడా… తన విద్యా సంస్థలకు రాలేదని.. ఇప్పటి వరకూ చెప్పిన మోహన్ బాబు… అసలు విషయం మాత్రం మర్చిపోయి.. రాజకీయ విమర్శలు చేస్తున్నారు.