మొత్తానికి గురువారం రాత్రి పొద్దు పోయాక సెన్సారు సర్టిఫికెట్ సాధించింది లక్ష్మీస్ ఎన్టీఆర్. కోర్టు కేసుల సంగతి అలా వుంచితే సెన్సారు సర్టిఫికెట్ రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? సెన్సారు అయిపోయిన, కట్స్ చెప్పి, యు సర్టిఫికెట్ ఇస్తామని చెప్పిన తరువాత సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదు? అసలు ఏం జరిగింది?
దీనిపై ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. సెన్సారు దాదాపు పాతికకు పైగా కట్స్ లేదా మ్యూట్ లు చెప్పింది. అదే సమయంలో అసలు సెన్సారు వారు ఈ సినిమాను చూడకూడదని, సర్టిఫికెట్ ఇవ్వకూడదని నందమూరి బాలకృష్ణ సెన్సారుకు లేఖ రాసారనో? ఫిర్యాదు చేసారనో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో సెన్సారు జనాలు చాలా కిందా మీదా అయ్యారు.
ఒకటికి మూడు సార్లు, కచ్చితంగా మూడు సార్లు సెన్సారు జనాలు సినిమా చూసారు. ఆఖరికి మరో రెండు కట్ లు చెప్పారు. ఇలాంటి టైమ్ లో యూనిట్ కు చెందిన వారో, బయ్యర్లో ఎవరి ప్రయత్నం వారు ప్రారంభించారు. పొలిటికల్ జనాల నుంచి ఫోన్ లు వెళ్లాయని తెలుస్తోంది. ముంబాయి సెన్సారు చైర్మన్ వరకు ప్రతి ఒక్కరు కలుగు చేసుకోవాల్సి వచ్చింది. ఆఖరికి రాత్రి బాగా పొద్దుపోయాక సర్టిఫికెట్ వచ్చింది.