లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టడం లేదని చివరి నిమిషంలో తేల్చి చెప్పారు. దీంతో దశాబ్దాలుగా టీడీపీలో ఉంటున్న కిందిస్థాయి నేతలు, అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పోటీకి అభ్యర్థులను పెట్టడం వల్ల తెరాసకి మేలు జరుగుతుందనీ, అందుకే ఈసారి పోటీ చెయ్యకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నామని టీ టీడీపీ నేతలు చెబుతున్నారు. తెరాసను ఓడించేందుకు ఇదొక వ్యూహం అన్నట్టుగా టీ టీడీపీ నేతలు భావిస్తున్నారేమోగానీ… కింది స్థాయికి ఇది వేరే సంకేతాలు పంపించింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీకి భయపడుతోందనీ, ఆదరణ లేకుండా పోయిందనీ, అభ్యర్థుల లేకపోయారనే అభిప్రాయాలే చాలావరకూ వెళ్తున్నాయి.
ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇప్పటికే తెరాస పావులు కదుపడం మొదలుపెట్టేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బలంగా ఉన్న టీడీపీ నేతలకు వల వేస్తోంది. ఈ ఆపరేషన్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాదవరం క్రిష్ణారావు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ద్వితీయ శ్రేణిలో బలంగా ఉన్న టీడీపీ నాయకుల్ని తెరాసలోకి తీసుకొస్తున్నారు. గ్రేటర్ లో నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్ ను తెరాసలోకి చేర్చుకున్నారు. అలాగే, సనత్ నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేష్ గౌడ్, సికింద్రాబాద్ కి చెందిన టీడీపీ నేత సారంగపాణి.. ఇలా నగరంలో టీడీపీకి బలంగా ఉన్న నాయకులతో చర్చలు జరిపి, తెరాసలో చేర్పించారు. ఇదే వ్యూహంతో రాష్ట్రంలో టీడీపీకి బలమైన కింది స్థాయి నేతల్ని పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలోనే పార్టీలోకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో తెరాస ఉన్నట్టు సమాచారం.
పోటీకి దూరంగా ఉండటం ఎన్నికల వ్యూహం అనుకున్నారేమోగానీ, అదే తెరాసకు మరో సానుకూల అంశంగా మారుతోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలన్న లక్ష్యంతో తెరాస మొదట్నుంచీ ఒక వ్యూహంతో వ్యవహరించింది. ఎమ్మెల్యేలకు వల వేసింది. ఇప్పుడు, కింది స్థాయి నుంచి కూడా వలసల్ని ప్రోత్సహిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ ను నిలుపుకునేందుకు ఇప్పుడు టీడీపీ ఎలాంటి ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఏదేమైనా, ఎన్నికలకు దూరంగా ఉండటం అనేది కిందిస్థాయి అభిమానులకు పెద్దగా రుచించని నిర్ణయంగా మారిందనడంలో సందేహం లేదు.