జనసేన పార్టీని గుర్తించడానికి కూడా… జగన్ ఇప్పటి వరకూ ఇష్టపడలేదు. ఇక.. కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతిని ఎలా గుర్తిస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కేఏ పాల్పైనా.. జగన్ నోరు చేసుకోవాల్సి వస్తోంది. అందులో అసహనం కూడా కనిపిస్తోంది. ఇక వైసీపీలో నెంబర్ టూ విజయసాయిరెడ్డి.. తన దాడిని పూర్తిగా.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీద పెట్టారు. 35 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లతో… ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు సిమిలర్‌గా ఉన్నాయి. నామినేషన్ల ఘట్టం ముగిసేవరకూ.. ఇలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేయలేకపోయింది.
పేరే వేరప్పా.. గుర్తులు, అభ్యర్థులు సేమ్ టు సేమ్..!
ఇప్పటి వరకూ ప్రజాశాంతి పార్టీ గుర్తు మీద.. వైసీపీ పదే పదే ఫిర్యాదులు చేస్తూ వస్తోంది. కేఏ పాల్ పార్టీకి.. ఈసీ హెలికాఫ్టర్ గుర్తు కేటాయించింది. ఆ గుర్తును కేఏ పాల్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎక్కడ మీడియా సమావేశం పెట్టినా… తన పార్టీ గుర్తు కనపడేలా పట్టుకుని కూర్చునేవారు. మొదట్లో వైసీపీ నేతలు.. దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ.. ఈసీ జాబితాలో ఉన్న గుర్తును చూసిన తర్వాత వారికి మైండ్ బ్లాంక్ అయినంత పనయింది. హెలికాఫ్టర్ రెక్కలు.. ఫ్యాన్ రెక్కల్లాగే స్పష్టంగా ఉన్నాయి. కాస్త పరిశీలనగా చూస్తే తప్ప… హెలికాఫ్టర్ కూడా.. ఫ్యాన్‌లాగే ఉందన్న అభిప్రాయం ఏర్పడింది. దీంతో.. వైసీపీ ఈ అంశంపై… పదే పదే ఈసీకి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తన గుర్తును గట్టిగానే రక్షించుకున్నారు. ఈసీ దగ్గర బలమైన వాదన వినిపించి.. అసలు ఫ్యాన్‌కు, హెలికాఫ్టర్‌కు సంబంధం ఏమిటని వారిని ఒప్పించి.. గుర్తును అట్టి పెట్టుకున్నారు. దీంతో గుర్తుల గందరగోళం లేకుండా… తమ క్యాడర్‌ను ఎలా సమాయత్తం చేయాలా.. అని వైసీపీ తంటాలు పడుతూండగానే.. మరో ముప్పు.. అభ్యర్థుల పేర్లతో ముంచుకొచ్చింది.
పాల్ రాజకీయానికి ఉక్కిరిబిక్కిరి..!
ప్రజాశాంతి పార్టీకి అసలు అభ్యర్థులు దొరుకుతారా..అని లైట్ తీసుకున్న వైసీపీ ఇప్పుడు… ఆ పార్టీ తమకు పెద్ద ముప్పులా మారిందని అంగీకిస్తున్నారు. నిజానికి పాల్ పార్టీ వెనుక చంద్రబాబు ఉన్నారని..వైసీపీ నేతలు అనేక సార్లు ఆరోపించారు. అయితే వారి కోణం వేరు. పాల్‌కు క్రైస్తవ మత ప్రబోధకునిగా మంచి పేరు ఉంది కాబట్టి… ఆయన పార్టీ క్రైస్తవుల ఓట్లు చీల్చుకుంటుందని.. అది వైసీపీకి నష్టం చేస్తుందన్న వరకే వైసీపీ నేతలు ఆలోచించారు. కానీ.. పాల్ మాత్రం.. వైసీపీ అగ్రనేతలు ఊహించనంత రాజకీయం చేశారు. ఫ్యాన్‌ను పోలి ఉండే గుర్తును కేటాయింపచేసుకున్నారు. అంతకు మించి…వైసీపీకి షాక్ ఇచ్చేలా ఒకే పేర్లతో అభ్యర్థులకూ బీఫామ్స్ పంపిణీ చేశారు. పాల్ రాజకీయం చూసి.. వైసీపీ బిత్తర పోవాల్సి వచ్చింది.
పాల్‌తో చంద్రబాబే చేయించారని చెబితే నష్టం తగ్గుతుందా..?
ఇప్పుడు మూడు రకాలుగా..పాల్ నుంచి వైసీపీకి ముప్పు పొంచి ఉంది. తమకే పడతాయనుకున్న క్రైస్తవ ఓట్లలో చీలిక, గుర్తు గందరగోళం, పేర్ల గందరగోళం.. తమ అభ్యర్థుల విజయావకాశాలను ఎలా ప్రభావితం చేస్తుందోనని.. ఆందోళన చెందుతున్నారు. అందుకే.. కేఏ పాల్.. చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అంతర్గత సమస్యను ఎదుర్కోవడానికే.. అప్పుడప్పుడు జగన్..ప్రచారానికి విరామం ఇవ్వాల్సి వస్తోంది.కానీ పాల్ దెబ్బకు.. అసలు మొత్తం తేడా వచ్చే పరిస్థితి ఏర్పడంటంతో… ఆ అసహనం ప్రసంగాల్లో కనిపిస్తోందని.. వైసీపీ నేతలు అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గుర్తులతో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ నేతలు.. ఆందోళన చెందుతున్నారు.