అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు లోక్‌సభ పోరు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో… గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఘోర పరాజయం చవిచూసిన కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఈ సారి టిడిపి అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. ఏమాత్రం రాజకీయ అనుభవంలేని.. బీసీ వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్‌ను వైసిపి అభ్యర్థిగా నిలిపింది. టిడిపి బలం, కోట్ల నేపథ్యం చూస్తే.. పైకి ఏకపక్ష పోరుగా కనిపిస్తున్నా.. గత ఎన్నికల ఫలితాలతో పోల్చితే హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది.
కలసి మెలసి కోట్ల – కేఈ కాంబినేషన్ ..!
కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీసీలు అత్యధికంగా ఉంటారు. కర్నూలు లోక్‌సభ నుంచి కోట్ల కుటుంబం 10 సార్లు విజయం సాధించింది. రాజకీయ పరిస్థితులు కూడా మారాయి. జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాల మధ్య 65 ఏళ్లకు పైగా రాజకీయ వైరం ఉంది. ఇరు కుటుంబాల మధ్య అస్సలు పొసిగేది కాదు. రెండు కుటుంబాలను చంద్రబాబు ఒక్కటి చేశారు. ఒకే తాటిపైకి తీసుకురాగలిగారు. ఇప్పుడు ఇద్దరూ భుజాల మీద చేతులేసుకుని తిరుగుతూ..ఒకే వాహనంలో కలిసి మెలిసి తిరుగుతూ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కర్నూలు జిల్లా రాజకీయంలో ఇది కీలక మలుపు. లోక్‌సభ స్థానం పరిధిలో అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్న వాల్మీకులు, చేనేతలు, యాదవులు తమవైపేనని టిడిపి, ముస్లిం మైనారిటీలు, ఎస్సీలు, రెడ్లలో ఎక్కువ ఓట్లు తమకేనని వైసిపి అంచనా వేసుకుంటోంది.
ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు.. పెద్ద ఎత్తున నేతల చేరికలు..!
కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి బరిలో ఉన్న కర్నూలు లోక్‌సభ స్థానంలో టిడిపికి కలిసివచ్చే అంశాలు దండిగానే ఉన్నాయి. సుధీర్ఘ రాజకీయ అనుభవం.. రాజకీయ కుటుంబ నేపథ్యం.. దశాబ్ధాల రాజకీయ వైరం ఉన్న కేఈ కుటుంబంతో సఖ్యత.. అన్ని అసెంబ్లీ స్థానాల్లో బలమైన టిడిపి అభ్యర్థులు.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. ఆర్డీఎస్, గుండ్రేవుల, వేదవతి, ఎల్లెల్సీ ప్రాజెక్టుల మంజూరు లాంటివన్నీ కోట్లకు అనుకూలమే. అలాగే… బలమైన నేతలందరూ.. టీడీపీలో చేరడం.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులందరూ… కోట్లకు సహకరిస్తూడటం కలసి వస్తున్నాయి.
పూర్తిగా పార్టీ బలంపైనే సంజీవ్‌కుమార్‌కు ఆశలు..!
వైసిపి అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ కు వైద్యుడిగా జిల్లాలో మంచి పేరు, గుర్తింపు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసిపి ఇక్కడ గెలవడం.. అయితే, సంజీవ్ కుమార్‌కు ప్రతికూలతలు కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం.. వైసిపిలోనూ ఎవరికీ తెలియకపోవడం.. టికెట్రాని వైసిపి నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉండడం ఈయనకు సెట్ బ్యాక్ అవుతోంది. పలువురు నేతలు ఇటీవలి కాలంలో.. టీడీపీలో చేరిపోయారు. అయితే.. వైసీపీ కంచుకోట అని… అభ్యర్థితో సంబంధం లేకుండా.. ఓట్లు వేస్తారన్న అంచనాలు వైసీపీలో ఉన్నాయి. ఇప్పటికి పరిస్థితి చూస్తే.. కోట్ల కుటుంబానికి సానుకూలమైన పరిస్థితి కనిపిస్తోందని అంచనా వేయవచ్చు.