గుజరాత్ మోడీ కోట. ఆయన ప్రధాని అనే సెంటిమెంట్‌తో అక్కడ లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ లో ఉన్న మొత్తం 26 లోక్ సభ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఈ సారి కూడా అదే పరిస్థితి ఉంటుందని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అన్ని స్థానాలను స్వీప్ చేస్తామని అంచనా వేస్తున్నాయి.
గుజరాత్లో బలం పుంజుకున్న కాంగ్రెస్..!
2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత గుజరాత్లో పరిస్థితి కొంత మారింది. కాంగ్రెస్‌కు జవసత్వాలు లభిస్తున్నాయి. బీజేపీ కి కంచుకోట గా మారిన గుజరాత్ లో ఆ పార్టీని ఎదుర్కొనే స్థితికి వచ్చింది. పైగా ఇప్పుడు రివర్స్ వలసలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ నాయకులు చాలా మంది కాంగ్రెస్ లో చేరారు . కొందరు కాంగ్రెస్ వారు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు ,. ఇప్పుడు గుజరాత్ లో బీజేపీ , కాంగ్రెస్ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రం లో బీజేపీ , కాంగ్రెస్ బలాబలాలను మార్చేశాయి . బీజేపీ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడింది . అక్కడ కొత్తగా యువ నాయకత్వం పుట్టుకొచ్చింది. కాంగ్రెస్ తెలివిగా యువనాయకత్వాన్ని తన వైపు ఆకర్షించింది . పటేళ్ల ఆందోళన కూడా ఇందుకు తోడయ్యింది . ఇదంతా కాంగ్రెస్ కు కలిసివచ్చింది .
అసెంబ్లీ ఎన్నికల్లో 26 స్థానాల్లో 10 చోట్ల కాంగ్రెస్‌కు మెజార్టీ ..!
అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాలను పోల్చి చూస్తే ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యత చూపించింది. ఒక్కో లోక్ సభ నియోజకవర్గం లో కాంగ్రెస్ మెజారిటీ 14,000 నుంచి లక్షా 68 వేల వరకూ ఉంది . కాంగ్రెస్ , ఎన్సీపీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే …మరో లోక్ సభ సీటు కూడా బీజేపీ కోల్పోవచ్చు . దీనర్ధం ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి కాంగ్రెస్ షాక్ ఇవ్వబోతున్నదన్న ప్రచారం జరిగింది. ప్రాంతాలవారీగా చూస్తే … సౌరాష్ట్ర , నార్త్ గుజరాత్ లో బీజేపీ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోబోతున్నది . ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించిన ఎనిమిది లోక్ సభ స్థానాల్లో ఏడూ ఈ రెండు ప్రాంతాల్లోనే ఉన్నాయి . హార్దిక్ పటేల్ కాంగ్రెస్ లో చేరడంతో… బలమైన వర్గం మద్దతు లభించే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్‌లోని బలమైన నేతల్ని లాగేసుకుంటున్న బీజేపీ..!
అసెంబ్లీ ఎన్నికల తరవాత గుజరాత్ మీద బీజేపీ లో అంతర్మధనం మొదలయింది . తగ్గిన పలుకుబడిని మళ్ళీ ఎలా దక్కించుకోవాలన్న విషయం పై పార్టీ లో చాల పెద్ద మధనం సాగింది . కాంగ్రెస్ లో ఓబిసి వర్గాలకు చెందిన బలమైన నాయకుడు కున్వర్జి బావలియా కు బీజేపీ గాలం వేసింది . బీజేపీ లో చేరిన నాలుగు గంటల్లోనే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టి సత్కరించింది . అయన తరవాత వరుసగా మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ లోకి దూకేశారు . మరో అరడజను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వల విసిరింది ప్రచారం సాగుతున్నది . తాను బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ నాయకులకు వల వేసి ఆకర్షించడం బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది . కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన మరో ఓబిసి యువ నాయకుడు అల్పేష్ ఠాకూర్ ను కూడా బీజేపీ లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి . ఎలాగైనా ఈ సారి కూడా పూర్తి స్థాయిలో విజయం సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది.