వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ విషయంలో… ఎవరూ పడనంత టెన్షన్‌ను.. వైసీపీ అధినేత పడుతున్నారు. సొంత బాబాయ్ హత్యకు గురైతే.. ఆయన వ్యవహరశైలి అనుమానాస్పదంగా కనిపిస్తోంది. బాధితులు ఎవరైనా …తమకు అన్యాయం జరిగితే.. వీలైనంత త్వరగా న్యాయం జరగాలని.. నిందితులను పట్టుకోవాలని కోరుకుంటారు. కానీ.. వైఎస్ వివేకా హత్య కేసులో మొత్తం తేడాగా జరుగుతోంది. విచారణను ఆలస్యం చేయడానికి.. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా… సహజమరణంగా చిత్రీకరించాలనుకున్నారు…కానీ విషయం బయట పడిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా రాజకీయ రంగు పులిమేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కావాలంటూ.. కోర్టులో పిటిషన్లు కూడా వేశారు. అంతిమంగా.. పోలీసుల దర్యాప్తు వివరాలను బయట పెట్టవద్దని.. కోర్టును కోరారు.
సిట్ నివేదిక ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని జగన్ ఆందోళన చెందుతున్నారు. అదే విషయాన్ని కోర్టులో చెబుతున్నారు. జగన్ ఆరోపిస్తున్నట్లుగా.. ఇందులో… టీడీపీ నేతల ప్రమేయం ఉంటే..జగన్ ఎందుకు ఆందోళన చెందుతున్నారనే దానిపై ఇప్పుడు ఏపీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.. వైఎస్ వివేకా హత్య కేసులో.. సాక్ష్యాలు తారుమారు చేసిన ఆరోపణలపై పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. ఆ సందర్భంగా రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. అత్యంత క్రూరంగా… వివేకానందరెడ్డిని హత్య చేశారని.. సాక్ష్యాలు మాయం చేయడానికి ప్రయత్నించారని తేలింది. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాష్ అనే వారిని అరెస్ట్ చేశారు. అయితే.. విచారణ ఇంకా సీరియస్‌గా ఉందని.. పెద్ద తలకాయలు బయటకు వస్తాయన్న ప్రచారం జరగుతున్న సమయంలోనే … . ఎస్పీని బదిలీ చేశారు. దీనికి కారణాలేమీ ఉండక్కర్లేదని.. ఈసీ చెబుతోంది.
సీబీఐ విచారణకు ఆదేశించాలని మాత్రమే కాదు.. వివరాలు బయట పెట్టవద్దన్న పిటిషన్ కూడా.. హైకోర్టులో విచారణలో ఉంది. ఈ విషయంలో తను అనుకున్నది ఏమీ జరగడం లేదనేమో.. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ అసహనం రోజూ బయట పడుతోంది. పవన్ కల్యాణ్ కూడా ప్రశ్నించడంతో.. ఆయన ఇంట్లో హత్య జరిగితే అంతే స్పందిస్తారా.. అంటూ ప్రశ్నించి అసహనాన్ని బయట పెట్టుకున్నారు. వివేకా హత్యకు గురైతే.. చంద్రబాబు పండుగ చేసుకున్నారంటూ.. వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య కేసు .. మరింతగా ప్రజల్లో చర్చనీయాంశమయ్యేలా జగనే చేస్తున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.