నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత కృష్ణ జిల్లాలో ఎక్కువ చోట్ల త్రిముఖ పోటీ నెలకొంది. మిగతా నియోజకవర్గాలలో జనసేన అభ్యర్ధులు ఎవరి ఓట్లు చీలుస్తారనే అనే అంశంపై ఆయా పక్షాలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా కతూన్, వైసిపి తరుపున వెల్లంపల్లి శ్రీనివాసరావు, జనసేన నుంచి పోతిన మహేష్. ఇండిపెండెంట్ గా విజయ్ కుమార్ రంగంలో ఉన్నారు. పోతిన మహేష్ చీల్చే ఓట్లు పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్ధుల తలరాతను మార్చనున్నాయి. ఇండిపెండెంట్ గా ఉన్న విజయ్ కుమార్ వైసీపీ ఓట్లు చీలుస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవర్గం లో తెలుగుదేశం తరుపున మంత్రి కొల్లు రవీంద్ర, వైసీపీ తరుపున పేర్నినాని, జనసేన తరుపున బండి రామకృష్ణ బరిలో ఉన్నారు. రామకృష్ణకు ఆర్ధిక,అంగబలాలు పుస్కలంగా ఉండటంతో జనసేన బలంతో పాటు తనకు ఉన్న ఓట్లను కూడా పోల్ చేయించుకుంటే విజయం తనదే అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈయన వైసీపీ ఓట్లు చీలిస్తే తెలుగుదేశం అభ్యర్ధి రవీంద్ర సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం తరుపున డిఫ్యూటీ స్పీకర్ మండలి బుద్దా ప్రసాద్, వైసీపీ తరుపున సింహాద్రి రమేష్ బాబు, జనసేన నుంచి ముత్తంశెట్టి కృష్ణారావుతో పాటు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్ధి రవివంకర్ కూడా పోటీలో ఉన్నారు. వీరందరూ బలమైన అభ్యర్థులుగానే కనిపిస్తున్నారు. అవనిగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్ధి గుడివాడ శ్రీమన్నారాయణ ప్రజాశాంతి పార్టీ నుంచి బి. ఫారం తెచ్చుకుని పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ జరుగుతుండంతో గెలుపు ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది.
కైకలూరు, పెడన నియోజకవర్గాలలో కూడా త్రిముఖ పోటీ నెలకొంది. కైకలూరులో తెలుగుదేశంఅభ్యర్ధిగా జయమంగళం వెంకటరమణ , వైసీపీ నుంచి దూలం నాగేశ్వరరావు, జనసేన అభ్యర్ధిగా బి. వెంకటేశ్వరరావులు పోటీలో ఉన్నారు. వీరి ముగ్గురి మధ్య జరుగుతున్న త్రిముఖ పోటీ కైకలూరులో ఆసక్తి రేపుతోంది. పెడన నియోజకవర్గంలో టిడిపి అభ్యర్దిగా కాగిత కృష్ణప్రసాద్, వైసీపీ అభ్యర్ధిగా జోగి రమేష్, జనసేన నుంచి అంకెం లక్ష్మీ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఈ సారి శ్రీనివాస్ చీల్చే ఓట్ల పైనే ప్రధాన పక్షాల అభ్యర్దుల గెలుపోటములు నిర్ణయం కానున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమ, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మిత్రపక్షాల తరపున సీపీఎం అభ్యర్ధి బాబూరావు రంగంలో ఉన్నారు. బాబూరావు ఎవరి ఓట్లు చీలుస్తారనే అంశంపై నే సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసిపి అభ్యర్దలు జాతకాలు ఆధారపడి ఉంటాయి.