బీజేపీ, వైసీపీ మధ్య లోపాయికారీ పొత్తులు ఎలాంటివో అక్కడక్కడ బయట పడ్డాయి. ముఖ్యంగా రాయలసీమలో బీజేపీకి అంతో ఇంతో ఓటు బ్యాంక్ ఉన్న రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో.. బీజేపీ అభ్యర్థి బరిలో లేకుండా పోయారు. ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మహేశ్వరరెడ్డి అనే వైసీపీ నేతకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ బీఫాం ఇచ్చారు. చిత్తూరు బీజేపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. ఈనెల 25వ తేదీన నామినేషన్ వేశారు. ఆ తర్వాత ప్రచారం గురించి పట్టించుకోలేదు. ఆయన తీరు అనుమానాస్పదంగా ఉన్నా… ఏపీ బీజేపీ బాధ్యులు లైట్ తీసుకున్నారు. ఉపసంహరణ చివరి రోజు.. ఆయన తన నామినేషన్ విత్ డ్రా చేసుకుని.. ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నారు. దాంతో గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న బీజేపీకి ఈ సారి అభ్యర్థి లేరు.
టీడీపీతో పొత్తుల్లో భాగంగా.. గత ఎన్నికల్లో రాజంపేటను.. బీజేపీకి కేటాయించింది టీడీపీ. అక్కడ్నుంచి పురందేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు. అయినా నాలుగున్నర లక్షలకుపైగా ఓట్లు తెచ్చుకున్నారు. అక్కడ బీజేపీకి కొంత క్యాడర్ ఉండటం… టీడీపీ ఓటు బ్యాంక్ కలసి రావడంతో.. ఈ ఫలితం వచ్చింది. మరో వైపు.. ఇదే పార్లమెంట్ నియోజకవర్గ పరిదిలో బీజేపీకి కొంత క్యాడర్ ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గంలోనూ బీజేపీ అభ్యర్థి విత్ డ్రా చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా బీఫారం అందుకున్న పీటీఎం మండలానికి డీఎం మంజునాథరెడ్డి ఈనెల 25న నామినేషన్ అయితే దాఖలు చేశారు కానీ చివరి రోజు గుట్టుగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. చిత్తూరు జిల్లాలో బీజేపీ అనగానే గుర్తొచ్చే నియోజకవర్గం తంబళ్లపల్లె అయితే గుర్తొచ్చే నేత చల్లపల్లె నరసింహారెడ్డి. పోటీ చేసిన ప్రతిసారీ గౌరవప్రదమైన ఓట్లను సాధించడమే కాకుండా 2004లో కేవలం 620ఓట్లతో ఓడిపోయిన నాయకుడు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ సారి ప్లాన్డ్ గానే ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. ఇతరులకు ఇచ్చి.. ఉపసంహరించుకునేలా చేశారు.
రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ సారి గట్టి పోటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రతీ సారి అక్కడ బలిజ అభ్యర్థులే గెలుస్తూ ఉంటారు. కానీ వైసీపీ తరపున మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో రెండు పార్టీల తరపున బలిజ అభ్యర్థులు బరిలోలేరు. ఈ సారి టీడీపీ తరపున డీకే ఆదికేశవులనాయుడు భార్య డీఏ సత్యప్రభను అభ్యర్థిగా నిలబెట్టారు. ఆమె వెంట బలిజ సామాజికవర్గం మొత్తం ఉంటుందనే అంచనాలున్నాయి. అదే సమయంలో… బీజేపీ తరపున నిలబడితే రెడ్డి సామాజికవర్గం అభ్యర్థే ఉంటారు. అదే జరిగితే తమ ఓట్లు చీలిపోయి నష్టపోతామన్న అంచనాతో.. బీజేపీతో లోపాయికారీ అవగాహనకు వచ్చి … రాజంపేట పార్లమెంట్ తో పాటు.. తంబళ్లపల్లెల్లో తమ వారికి బీఫామ్‌లు ఇప్పింటుకుని ఉపసంహరించుకునేలా చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.