వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ రాజకీయం కాకుండా.. హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సిట్ దర్యాప్తును కొనసాగించాలని ఆదేశిస్తూ.. వివరాలను బయట పెట్టవద్దని స్పష్టం చేసింది. అదే సమయంలో రాజకీయ పార్టీల నేతలు వివేక హత్య కేసు గురించి మాట్లాడవద్దని హైకోర్టు సూచించింది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకారపత్రం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల పదిహేనో తేదీకి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడుతున్నారని… ఆయన పర్యవేక్షణ లేని దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని… జగన్మోహన్ రెడ్డితో పాటు..వైఎస్ వివేకా భార్య సౌభాగ్య కూడా.. హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ కేసు దర్యాప్తు వివరాలు బయటకు వస్తే.. రాజకీయంగా తమకు నష్టం జరుగుతుందని…సిట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టవద్దని… జగన్ మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటిపై విచారించిన హైకోర్టు… రాజకీయనేతలు బయట ఈ కేసుపై విమర్శలు చేసుకోకపోతే.. సమస్య సద్దుమణుగుతందని భావించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు రాజకీయ పార్టీలన్నీ.. వివేకా హత్య కేసు గురించి మాట్లాడకుండా ఆదేశాలిచ్చారు. అలాగే.. వచ్చే నెల పదిహేనో తేదీకి వాయిదా వేశారు కాబట్టి.. అప్పటి వరకు సిట్ అధికారులు కూడా విచారణ వివరాలు బయట పెట్టే అవకాశం లేదు.
దాంతో రాజకీయంగా… వివేకా హత్య కేసుపై.. విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకునే అవకాశం ఇక పోలింగ్ వరకూ లేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఈ అంశానికి రాజకీయంగా ప్రాముఖ్యత ఉండదు. ఆ తర్వాత సిట్ వివరాలు బయట పెట్టినా.. రాజకీయ సంచలనం అయ్యే అవకాశాలు ఉండకపోచ్చు. మొత్తానికి.. వివేకా హత్య కేసు వివరాలు బయటకు వస్తే.. తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని అనుకున్న వైసీపీ నేతలకు కోర్టు ఉత్తర్వులు ఊరటనిచ్చినట్లుగానే భావించవచ్చు.